జాతీయ సగటు కంటే ఎక్కువగా వృద్ధిరేటు
జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధిరేటు ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు శనివారం ఆయన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మాన్యశ్రీ అధ్యక్షా, సభాపతి మహాశయా, గౌరవనీయులైన సభ్యులారా అంటూఅచ్చతెలుగులో తన ప్రసంగాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. రాష్ట్ర సత్వరాభివృద్ధికి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయని కూడా తెలుగులోనే చెప్పారు. ఆ తర్వాతి నుంచి ఆయన ప్రసంగం ఇంగ్లీషులో కొనసాగింది. విభజన తర్వాత కూడా రాష్ట్రం మంచి పురోగతి సాధించిందని, అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండింటికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై విభజన తీవ్ర ప్రభావం చూపించిందని, విభజన తర్వాత మనకు 46 శాతం నిధులు మాత్రమే వచ్చాయని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటించడం లాంటివి విభజన చట్టంలో ఉన్నా కూడా.. ఇంకా ఆ హామీలను కేంద్రం నెరవేర్చాల్సి ఉందని తెలిపారు. హుదూద్ తుఫాను కారణంగా విశాఖ ప్రాంతానికి సుమారు రూ. 70 వేల కోట్ల నష్టం వచ్చిందని, ఆ తర్వాత చాలా జిల్లాల్లో కరువు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరదలు వచ్చాయని చెప్పారు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా 2015-16 సంవత్సరంలో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటును సాధించిందని అన్నారు. జాతీయ సగటు కంటే ఎక్కువగా మనకు 10.99 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. వ్యవసాయం 8.40 శాతం వృద్ధి చెందిందని, ఇక చరిత్రలో తొలిసారిగా తలసరి ఆదాయం 1.07 లక్షలకు చేరుకుందని అన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను టాప్ 2 రాష్ట్రాల్లోను, 2024 నాటికి అగ్రస్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని గవర్నర్ చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి నుంచి కృష్ణాడెల్టాకు నీళ్లు అందించామని, దీని కారణంగానే రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్లు అందే అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కృష్ణా, పెన్నా నదులను కూడా అనుసంధానం చేసి, రైతులకు మేలు చేకూరుస్తామని వివరించారు.
ఇప్పటికే ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీలలో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటుచేశామని, 8 నెలల్లోగా ఆయన తన నివేదికను అందజేయాల్సి ఉందని తెలిపారు. చరిత్రలో తొలిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని పేదలకు రుణాలు ఇచ్చామని చెప్పారు. అనంతరం ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఆయన చెప్పారు.
''మన స్థితికి మనమే బాధ్యులం; మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం; మనల్ని మనం తీర్చిదిద్దుకునే శక్తి మనకుంది; మన గత చర్యల ఫలితమే మన ఇప్పటి పరిస్థితి అయినట్లయితే, ప్రస్తుత మన చర్యలను బట్టే భవిష్యత్తులో మనం ఎలా ఉండబోయేదీ అవగతమవుతుంది. కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి'' అన్న స్వామి వివేకానంద మాటలతో ప్రసంగాన్ని ముగించారు.