ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం-1987 అమల్లోకి వచ్చే నాటికి.. వంశపారంపర్య ధర్మకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే ధార్మిక సంసుథలు,
* దేవాలయాల్లో ట్రస్టీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
* 1987 చట్టం వచ్చే నాటికి గుర్తింపు పొందిన వారే అర్హులని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం-1987 అమల్లోకి వచ్చే నాటికి.. వంశపారంపర్య ధర్మకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే ధార్మిక సంసుథలు, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ధర్మకర్తలుగా నియమితులయ్యేందుకు అర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. 1966లో ఉన్న ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం కింద వంశపారంపర్య ధర్మకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందని వ్యక్తి తనను ట్రస్టీగా గుర్తించాలని 1987 చట్టం కింద సమర్థాధికారి (కాంపిటెంట్ అథారిటీ)ని ఆశ్రయించజాలడని తేల్చి చెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. అలాగే.. 1987 చట్టం కింద ఓ వ్యక్తి ఒకసారి వంశపారంపర్య ధర్మకర్తగా గుర్తింపు పొందితే, అతని తర్వాత అతని కుటుంబ సభ్యులు తిరిగి గుర్తింపు కోసం సమర్థాధికారిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని కూడా ధర్మాసనం పేర్కొంది. 1987 చట్టం వచ్చిన తరువాత ఏర్పాటైన హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల విషయంలో మాత్రం ఓ వ్యక్తి తనను వ్యవస్థాపకునిగా లేదా వ్యవస్థాపకుని కుటుంబ సభ్యునిగా గుర్తించాలని సమర్థాధికారిని ఆశ్రయించవచ్చునని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే ట్రిబ్యునల్ విచారించాలని స్పష్టంచేసింది.
గుంటూరు జిల్లా పామిడిపాడు అగ్రహారం గ్రామంలోని శ్రీ వల్లభరాయేశ్వర స్వామి దేవస్థానాన్ని తమ పూర్వీకులు తమ సొంత భూమిలో నిర్మించారని, అందువల్ల ఆ దేవస్థానం వ్యవస్థాపకుల కుటుంబ సభ్యునిగా తనను గుర్తించాలని కోరుతూ బెల్లంకొండ వెంకట సుబ్రహ్మణ్యశర్మ దేవాదాయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ అందుకు సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలయ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించిన జలసూత్రం వెంకట సుబ్బయ్య హైకోర్టును ఆశ్రయించగా ట్రిబ్యునల్ ఉత్తర్వులను తప్పుపడుతూ తాజా తీర్పు వెలువరించింది.