ఆశతీరక ఆగ్రహం | Activists hope feared for wage arrears | Sakshi
Sakshi News home page

ఆశతీరక ఆగ్రహం

Published Tue, Jul 8 2014 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

ఆశతీరక ఆగ్రహం - Sakshi

ఆశతీరక ఆగ్రహం

  • వేతన బకాయిల కోసం కదం తొక్కిన ఆశ కార్యకర్తలు
  •  ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తం
  •  ఏపీఓ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ
  • పాడేరు : అసలే చాలీచాలని వేతనం.  రూ.400 గౌరవ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నా...అదీ సకాలంలో అందని దుస్థితి. బకాయిలు అడిగితే ఇదిగో అదిగో అంటూ తిప్పలు పెట్టే ఐడీడీఏ...దీంతో కడుపు మండిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏను చుట్టుముట్టారు. 14 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళనలో కదం కలిపారు.

    సీఐటీయు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఆశ కార్యకర్తలు సోమవారం ఉదయాన్నే పాడేరుకు చేరుకొని ఐటీడీఏ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. బకాయి వేతనాలు, టీఏ, డీఏలు వెంటనే చెల్లించాలని నెలకు రూ.3 వేలు చొప్పున వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

    ఆశల నినాదాలతో ఐటీడీఏ ప్రాంతం దద్దరిల్లింది. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాడేరు ఎస్‌ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఐటీడీఏ చుట్టూ భద్రతా చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం వరకు ధర్నా కార్యక్రమంతో తమ సమస్యలపై నినాదాలు చేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో కదలిక లేకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది.

    వీరంతా ఒక్క ఉదుటున ఐటీడీఏ కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే రెండు గేట్లను మూసివేయడంతో బయట నుంచే ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమకు బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని ఇక్కడే మకాం ఉంటామంటూ మహిళలు గర్జించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం నిమిత్తం విశాఖపట్నం వెళ్లిపోవడంతో ఇక్కడ ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు ఫోన్ ద్వారా ఆయనకు ఆశ కార్యకర్తల ఆందోళన విషయాన్ని తెలియపరిచారు.

    ఐటీడీఏ పీఓకూడా ఈ సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆందోళన కారులతో చర్చలు జరపాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. దీంతో ఏపీఓ పీవీఎస్ నాయుడు సీఐటీయు, గిరిజన సంఘం, ఆశ కార్యకర్తల సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే 4 నెలల గౌరవ వేతనాలు ఆశ కార్యకర్తల బ్యాంకు అకౌంట్లలో జమచేశామని, మిగిలిన 9 నెలల వేతనాలను కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేలా జిల్లా కలెక్టరు చర్యలు తీసుకుంటారని ఏపీఓ హామీ ఇచ్చారు.

    అనంతరం ఆశ కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి కూడా ఏపీఓ చేరుకొని బకాయి వేతనాల చెల్లింపులకు ఐటీడీఏ చేపట్టే అత్యవసర చర్యలను వివరించారు. అయినప్పటికి కొంత మంది ఆశ కార్యకర్తలు సంతృప్తి చెందలేదు. వేతనాల చెల్లింపులను పక్కనపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా సాటి గిరిజనుల వైద్యానికి శ్రమిస్తున్నామని, శ్రమకు తగ్గ వేతనాలు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఏపీఓ తెలపడంతో ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా నాయకులు ఎంఎం శ్రీను, పాలికి లక్కు, సుందరరావు, ఆశ కార్యకర్తలసంఘం జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఇ.ప్రభ, పాడేరు డివిజన్ అధ్యక్షురాలు వై.మంగమ్మ, అన్ని మండలాలనాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement