నటనలో వారే నాకు స్ఫూర్తి
ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్లే ఆదర్శం
నటనలో ఉన్నత స్థానమే లక్ష్యం
ఆసక్తితోనే సినీ రంగంలోకి..
స్వగ్రామం వచ్చిన బుల్లితెర నటుడు కూన వేణుగోపాల్
ఎచ్చెర్ల: సినీ నటదిగ్గజాలు ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ వంటి నటులే స్ఫూర్తిగా... నటనలో ఉన్నతస్థానాని కి చేరటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రముఖ బుల్లితెర, సినీ నటుడు కూన వేణుగోపాల్ చెప్పారు. శ్రీకాకుళం పట్టణం లో జరుగుతున్న దివంగత మెట్ట అప్పారావు రాష్ట్రస్థాయి నాటికల పోటీలకు హాజరయ్యేందుకు శనివారం ఆయన స్వగ్రామమైన ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత.. తన మేనమామ మెట్ట అప్పారావునాయుడు స్ఫూర్తితోనే నటనవైపు అడుగులు వేసినట్లు చెప్పారు. బీ ఫార్మసీ, పీజీ మాస్ కమ్యూనికేషన్స్ చదివినా ఉద్యోగం కంటే నటనపై ఆసక్తితో ప్రయత్నించినట్లు చెప్పారు. ఇష్టం ఉన్న వృత్తిలో పనిచేస్తే జీవితం సంతోషంగా ఉంటుందని, అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు.
తాను ఇంతవరకు బంగారు కోడిపెట్ట, జైశ్రీరాం, వెయ్యి అబద్ధాలు, సరదాగా అమ్మాయిలతో.. వంటి సినిమాల్లో నటిం చానని చెప్పారు. అయితే సినీ రంగం కంటే బుల్లితెర సీరియ ల్స్ తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందన్నారు. ఈ టీవీలో ప్రసారమవుతున్న అలామొదలైంది, జీటీవీలో ప్రసారమవుతున్న గంగతో రాంబాబు, అన్వేషిత వంటి సీరియల్స్ మంచి పేరు తెచ్చాయన్నారు. 2009లో ఎఫ్‌ఎం రేడియోలో యాంకర్‌గా పనిచేసి అనంతరం మా మ్యూజిక్‌లో సమ్‌థింగ్ స్పెషల్ కార్యక్రమంలో యాంకరింగ్‌తో నట జీవితం ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం మా టీవీలో ప్రసారమైన పలు ఇంట ర్వ్యూలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, సమంత, తమన్నా తదితరుల ఇంటర్వ్యూ లు ప్రేక్షకుల్లో తనకు మంచి గుర్తింపు తెచ్చాయన్నారు. నటన లో నానాపటేకర్, ప్రకాష్‌రాజ్ వంటి నటులే స్ఫూర్తిగా ముం దుకుసాగుతున్నట్లు చెప్పారు. అన్ని రకాల పాత్రలు నటిస్తేనే మంచి గుర్తింపు నిస్తాయన్నారు. ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా టీవీ, సినిమా రెండు రంగాల్లోనూ అన్ని రకాల పాత్రలూ చేస్తున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రంగస్థల నటులు మెట్ట పోలినాయుడు, మెట్ట వెంకటపతిరాజు ఉన్నారు.