సినిమాలైనా వదిలేస్తా.. రంగస్థలాన్ని మాత్రం వదలను
ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి
కంబాలచెరువు (రాజమండ్రి) : తనకు రంగస్థలం అమ్మవంటిదని, అవసరమైతే సినిమాలైనా వదిలేస్తాను కానీ నాటక రంగాన్ని వదలనని ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. నందీ నాటకోత్సవాలకు వచ్చిన ఆయన శనివారం విలేకర్లతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘1961లో కాలేజీలో నాటకాలు వేసేవాడిని. నా తండ్రి సారధిరెడ్డి (రిటైర్డ్ ఏఎస్పీ) మంచి కళాకారుడు. ఆయన స్ఫూర్తితో నాటకరంగంలో స్థిరపడ్డాను. తెలుగు నాటకాల్లో టెక్నిక్స్ ఉపయోగించడంలేదు. వాటిని ఉపయోగించుకోవాలి. అప్పుడే ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుంది. నాటకాల నిడివి చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా దీనిని సంక్షిప్తం చేసి ప్రదర్శిస్తే నాటకాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. నందీ నాటకోత్సవాల పేరుతో ఏడాదికోసారి నిర్వహించడంకాదు. ప్రతి జిల్లాలోనూ ప్రతి నెలా నాటకోత్సవాలు నిర్వహించాలి. కళాకారులను ప్రోత్సాహించాలి. అప్పుడే నాటకాలపై ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది. నాటకాలపై నాకున్న మక్కువతో గుంటూరులో నాటక సమాజం పెట్టి ప్రతి నెలా నాలుగు నాటకాలు ప్రదర్శిస్తున్నాను. రంగస్థలంపై నాకున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ నాటకాలు ప్రదర్శిస్తున్నారని తెలిసినా వెంటనే చూడడానికి వెళతాను.’’