సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొనటంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛందంగా స్పందించి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. సీమాంధ్రలో బస్సులు నడిచే పరిస్థితి లేదని కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి వచ్చినా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వేను కోరాలనే స్పృహ లేకపోవటంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా అదనపు రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నా రైల్వే అధికారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని అదనపు రైళ్లను నడుపుతున్నారు.
ఆగస్టు నెలలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండకపోవటంతో అదనపు రైళ్లను నడపాల్సిన పరిస్థితి రాదు. సమైక్య ఉద్యమంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించటంతో రద్దీ అమాంతం పెరిగింది. దీన్ని గుర్తించిన రైల్వే అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అదనపు బోగీల వివరాలు సేకరించి రెగ్యులర్ రైళ్లకు జత చేస్తున్నారు.తాజాగా 10 వేల అదనపు బెర్తులు అందుబాటులోకి వచ్చేలా 157 అదనపు బోగీలను సిద్ధం చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు బెర్తులను ఈనెల 31వ తేదీ వరకు రద్దీ మార్గాల్లోని ప్రధాన రైళ్లకు అనుసంధానిస్తారు.
అదనపు బోగీలు ఈ రైళ్లకే..
కాకినాడ-బెంగళూరు(శేషాద్రి ఎక్స్‌ప్రెస్), తిరుపతి-ఆదిలాబాద్(కృష్ణా ఎక్స్‌ప్రెస్), కాచిగూడ-చిత్తూరు(వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్), తిరుపతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలను రైల్వేశాఖ సిద్ధం చేసింది. సికింద్రాబాద్-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని అదనపు బోగీలను తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సీమాంధ్ర రైళ్లకు అదనపు బోగీలు
Published Thu, Aug 15 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement