సాక్షి, హైదరాబాద్: మౌలిక సౌకర్యాలు పెంపు పేరుతో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలపై అదనపు ఆస్తి పన్ను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పన, పెంపునకు 2015-20 సంవత్సరాల కాలంలో రూ. 46,695 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఇందులో కొంత 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నుంచి వస్తాయని, మిగతా నిధులను ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ రుణం చెల్లింపు పూర్తయ్యే వరకు పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజలపై సాధారణ ఆస్తి పన్నుకు అదనంగా సప్లమెంటరీ ఆస్తి పన్నును వసూలు చేయనున్నారు. తాగునీరు, భూగర్భడ్రైనేజి, వరద కాలువలు, డ్రయిన్లు, నీటి వనరులు, పార్కులు, రోడ్లు వగైరా మెరుగుపరుస్తారు. రుణం తీరిన తరువాత అదనపు పన్ను వసూలును నిలుపుదల చేస్తారు.