బంపర్ ఆఫర్! | Administrators vans Bumper giving offers | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్!

Published Wed, Jul 22 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

బంపర్ ఆఫర్!

బంపర్ ఆఫర్!

- నక్కపల్లి నుంచి ఆటోలో రూ.200లు
- గాజువాక నుంచి వ్యాన్‌లో రూ.350లు
- తిరుగు ప్రయాణంలోనూ దైవ దర్శనాలు
- ఆసక్తి చూపుతున్న పుష్కర యాత్రికులు
సాక్షి, విశాఖపట్నం:
పుష్కర స్నానం చేయడమే జీవిత పరమార్థంగా భావిస్తున్న యాత్రిలకు ఆటోలు, వ్యాన్‌ల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఆర్టీసీతో పోల్చుకుంటే అతి తక్కువ చార్జీకే వీరు రాజమండ్రి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. పైగా 12 నుంచి 16 గంటల్లోపై యాత్ర ముగించి ఇంటి వద్ద దించుతున్నారు. డబ్బు, సమయం కూడా ఆదా అవుతుండడంతో పలువురు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. గాజువాక, అనకాపల్లి నుంచి టాటా ఏస్, మ్యాజిక్, తూఫాన్, జీపులు వంటి వాహనాల్లో వాటి యజమానులు రాజమండ్రికి ట్రిప్పులు వేస్తున్నారు.

ఒక్కో వాహనంలో కనీసం 12 నుంచి 15 మందిని ఎక్కించుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో గాజువాక నుంచి రూ.4500-5000లు, అనకాపల్లి నుంచైతే రూ.4000లు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కొక్కరికి సగటున రానూపోనూ రూ.300 నుంచి 350లకు మించడం లేదు. గాజువాక నుంచి రాజమండ్రికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.200.లు, డీలక్స్‌కు రూ.220లు, సూపర్ లగ్జరీకి రూ.250లు టిక్కెట్టు ధర ఉంది. మరోవైపు నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం తదితర ప్రాంతాల నుంచి ఆటోలను నేరుగా 100-120 కి.మీల దూరంలో ఉన్న రాజమండ్రికి తిప్పుతున్నారు. ఆయా చోట్ల నుంచి ఒక్కొక్కరికి కేవలం రూ.200లకే పుష్కరాలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. ఆటోలు, వ్యాన్లు చిన్న వాహనాలు కావడంతో పుష్కర ఘాట్ల సమీపం వరకూ వెళ్లనిస్తున్నారు. దీనివల్ల వీరికి ఎక్కువ దూరం నడవాల్సిన పనీ లేదు.

రాజమండ్రి లోని పుష్కర ఘాట్లు రద్దీగా ఉంటే ఆవల భక్తుల తాకిడి తక్కువగా ఉన్న కొవ్వూరు ఘాట్లకూ తీసుకెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో దారిలో ఉన్న పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో ఆటోవాలాకు డీజిల్ ఖర్చు రూ.500లు పోను రోజుకు రూ.1500ల ఆదాయం సమకూరుతోంది. ఇది ఉభయ తారకంగా ఉండడంతో పదేసి మంది కలిసి ఒక ఆటోను బుక్ చేసుకుని పుష్కరయాత్ర పూర్తి చేసుకుంటున్నారు. ఆర్టీసీతో పోల్చుకుంటే వ్యాన్, జీపు, ఆటో చార్జీలు బాగా తక్కువ ఉండడం, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కకపోవడం, కిలోమీటర్ల మేర నడక తప్పడం వంటివి బేరీజు వేసుకుని వాటికి మొగ్గు చూపుతున్నారు. పైగా ఉదయం బయల్దేరితే సాయంత్రానికో, రాత్రికో తీసుకొచ్చి దించేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇవెంతో ఉపయోగంగా ఉంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement