విశాఖపట్నం ,ఆరిలోవ(విశాఖ తూర్పు): గ్రామీణ ప్రాంతంలో ప్రతిభా వంతులైన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు చక్కని అవకాశం ఉంది. ఉచిత వసతి, భోజనం, విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ విద్యాలయాల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించేందుకు ఈ ఆదర్శ పాఠశాలలను నెలకొల్పారు.
జిల్లాలో ఐదు ఆదర్శ విద్యాలయాలు
2013లో రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా మన జిల్లాలో నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, చీడికాడ మండలం మంచాల, కశింకోట మండలం తేగాడ, మునగపాక మండలం పాటిపల్లిలో ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో 80 మంది వంతున 5 పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. వారికి ఇంటర్ వరకు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యను అందిస్తారు.
దరఖాస్తు చేసుకోండిలా..
ఏపీ ఆన్‌లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీపీ.జీవోవీ. ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకుని ఆయా మండలాల్లోని ఆదర్శ బడుల్లో సమర్పించాలి. ఆధార్, కులం, ఆదాయం, తదితర ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ప్రవేశ రుసుం ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50లను ఏపీ ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి.
రిజర్వేషన్లు ఇలా..
ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 29శాతం బీసీలకు(బీసీ‘ఎ’–07, బీసీ‘బీ’–10, బీసీ‘సీ’–01, బీసీ‘డీ’–07, బీసీ‘ఈ’–04శాతం) కేటాయించారు. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33శాతం సీట్లను కేటాయించారు. నిర్దేశించిన గ్రూపుల్లో అర్హులైన వారు లేని పక్షంలో ఇతర విభాగాల్లోని వారితో భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 50శాతం సీట్లను ఇతర కులాలకు నిర్దేశిస్తారు.
మార్చి 31న ప్రవేశ పరీక్ష
ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయాలి. 2019 మార్చి 31న ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఎంపిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
అర్హులు ఎవరంటే..
♦ ఓసీ, బీసీ విద్యార్థులు 2007 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
♦ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2005 సెప్టెంబరు 1, 2009 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
♦ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2018–19లో మాత్రం ఐదో తరగతి చదివి ఉండాలి..
రాత పరీక్ష ఇలా..
మార్చి 31న ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఐదో తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ పాఠ్యాంశాలపై 25 మార్కుల వంతున ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హతగా 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు విధిగా సాధించాలి.
Comments
Please login to add a commentAdd a comment