సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ఇన్‌చార్జి కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లకు జారీచేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నట్లు శనివారం ఆయన మరో సర్క్యులర్‌ను విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు శుక్రవారం నాటి సర్క్యులర్ ఉపసంహరణలో ఉంటుందని తాజా సర్క్యులర్‌లో సాయిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు కూడా తాజా సర్క్యులర్ సమాచారాన్ని ఆయన చేరవేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం రాష్ట్ర మంత్రి మండలికి లేదని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అసలు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియామకమే చెల్లదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ తనను తాను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించుకుంటూ జారీచేసుకున్న ఉత్తర్వులు కూడా చెల్లవని ఆయన స్పష్టంచేశారు. నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు చట్ట పరిధిని అతిక్రమించి చేసుకున్న.. అమలుచేయడానికి వీల్లేని ఉత్తర్వులుగా పరిగణించాలని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషనర్‌గా తనను తాను పునరుద్ధరించుకున్న తరువాత నిమ్మగడ్డ జారీచేసిన ఆదేశాలు ఏవీ కూడా చెల్లుబాటు కావన్నారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 కింద ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం, అర్హతలను నిర్ణయించే అధికారం మంత్రి మండలికి లేదన్న హైకోర్టు తీర్పువల్ల, చట్టం వచ్చిన 1994వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల కమిషనర్ల నియామకాలేవీ కూడా చెల్లబోవని ఆయన తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలుపుదల కోసం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసి ఉన్నామని.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ, కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శ్రీరామ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
మాట్లాడుతున్న అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్. చిత్రంలో గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్
1994 నుంచి నియమితులైన వారికీ ఈ తీర్పు వర్తిస్తుంది..
‘ఓ ముఖ్య కార్యదర్శి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించవచ్చని పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 చెబుతోంది. అయితే, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అధికరణ 234కే(2)కు అనుగుణంగా ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం రాష్ట్రానికి లేదన్నది తేలింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి ఎన్నికల కమిషనర్‌గా కావడానికి వీల్లేదు. ఎన్నికల కమిషనర్‌గా నియమించే వ్యక్తి అర్హతలను నిర్ణయించే అధికార పరిధి రాష్ట్రానికి లేనప్పుడు, ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా నియమితులై ఉంటే, వారిని నియమించే అధికారం కూడా రాష్ట్రానికి లేదు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఫలానా అధికారం లేదని కోర్టు తేలిస్తే, ఆ తీర్పు.. ఇప్పటికే నియమితులై వారికీ, ఇకపై నియమితులు కాబోయే వారికీ వర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200, 1994 సంవత్సరంలో వచ్చి ఉంటే, అప్పటి నుంచి ఈ తీర్పు వర్తిస్తుంది. దీని ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రమేష్‌కుమార్‌కు సైతం వర్తిస్తుంది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో మంత్రి మండలి, ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు, ఇలాంటి నిబంధన ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలోనూ, అధికరణ 243కే విషయంలో కూడా హైకోర్టు చెప్పింది’.. అని శ్రీరామ్ వివరించారు.
నిమ్మగడ్డ పేరును చంద్రబాబే సిఫారసు చేశారు
‘నిమ్మగడ్డ రమేష్ నియామకం రమాకాంత్‌రెడ్డి నియామకం తరువాత జరిగింది. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి నడిచింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 16.11.2015న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్‌ను ఎన్నికల కమిషనర్‌గా సిఫారసు చేశారు. ఆ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. ఇది జరిగిన సుమారు ఓ నెల తరువాత 12.12.2015న సవరించిన సిఫారసును పంపారు. నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని సిఫారసు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించే విషయంలో రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు గవర్నర్ నడుచుకోరాదని ఈ తీర్పు చెప్పిందంటే, నిమ్మగడ్డ రమేష్ నియామకం కూడా న్యాయ విరుద్ధమే అవుతుంది. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే వ్యవహరించాలి తప్ప మంత్రి మండలి సిఫారసు మేరకు కాదన్న హైకోర్టు తీర్పును అమలుచేయాల్సి వస్తే, ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ నియామకం ఏ మాత్రం చెల్లుబాటు కాదు’.. అని చెప్పారు.
‘నిమ్మగడ్డ’ఆదేశాలేవీ చెల్లుబాటు కావు
‘అంతేకాదు.. ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో న్యాయవాది (స్టాండింగ్ కౌన్సిల్)గా వీవీ ప్రభాకరరావు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున ఆయన కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారు. ఈరోజు ఉదయం నిమ్మగడ్డ రమేష్ తన ఫోన్ నుంచి వీవీ ప్రభాకరరావుకు స్వయంగా ఫోన్‌చేసి, స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుకు రేపటిలోగా రాజీనామా చేయాలని అడిగారు. ఎన్నికల కమిషన్‌లో కొత్త రక్తం నింపాలని భావిస్తున్నట్లు ఆయనతో నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. కొత్త స్టాండింగ్ కౌన్సిల్‌ను సోమవారం కల్లా నియమించనున్నట్లు నిమ్మగడ్డ చెప్పారు. కొంత సమయం కావాలని ప్రభాకర్‌రావు కోరినా కూడా నిమ్మగడ్డ గడువు సాధ్యంకాదని స్పష్టంచేశారని ప్రభాకరరావు నాకు చెప్పారు. దీనిపై ప్రభాకరరావు ఏజీగా నన్ను అభిప్రాయం కోరారు. ఎన్నికల కమిషనర్‌గా స్వీయ పునరుద్ధరణే చెల్లనప్పుడు నిమ్మగడ్డ ఇచ్చే ఇలాంటి ఆదేశాలు చట్ట పరిధిలోకి రావని నేను స్పష్టంగా చెప్పాను. వాటికి లోబడి ఉండాల్సిన అవసరంలేదని స్పష్టంచేశాను. ప్రభుత్వం స్టే కోసం దరఖాస్తు చేసి ఉన్నాం. సుప్రీంకోర్టుకు సైతం వెళ్తున్నాం. నిమ్మగడ్డ చర్యలకు హైకోర్టు తీర్పు మద్దతునిచ్చే విధంగా లేదు. హైకోర్టు తీర్పు అధికారిక కాపీ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చింది. దానిని చదివి ఈ పాయింట్లు లేవనెత్తడం జరిగింది’.. అని శ్రీరామ్ వివరించారు.
గడువు విధించనప్పుడు తీర్పు అమలుకు రెండు నెలల గడువు ఉంటుంది
‘హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిస్థితులు ఇలా ఉండటంవల్లే, ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నా అభిప్రాయం అడిగారు. నేను స్పష్టంగా చెప్పాను. పరిస్థితులు ఇలా ఉండగా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీచేసుకున్న స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు, ఆ తరువాత జారీచేసిన ఆదేశాలను ఎలా అమలుచేయాలన్న సందిగ్థతతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నన్ను అభిప్రాయం కోరారు. కోర్టు ధిక్కార నిబంధనల ప్రకారం.. ఏదైనా తీర్పులో నిర్ధిష్ట కాల వ్యవధిని న్యాయస్థానం విధించకుంటే, ఆ తీర్పును అమలుచేసేందుకు ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసి ఉంటే, అప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఉత్తర్వులు జారీచేసి ఉండేది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు అలా ఉత్తర్వులేవీ ఇప్పటివరకు జారీచేయలేదు. ఈ నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేష్ చేసుకున్న స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా లేవు. ఇలాంటి ప్రొసీడింగ్స్ ఆయన ఇవ్వజాలరు. వాటిని అమలుచేయలేని నిర్ణయాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాను’.. అని శ్రీరామ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment