నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court Notices to Nimmagadda Ramesh | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు

Published Thu, Jun 11 2020 4:01 AM | Last Updated on Thu, Jun 11 2020 7:44 AM

Supreme Court Notices to Nimmagadda Ramesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రాకేష్‌ ద్వివేది వాదనలు వినిపించారు.

నిమ్మగడ్డ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే, టీడీపీ నేత వర్ల రామయ్య తరఫున ఏకే గంగూలీ, బసవ ప్రభు పాటిల్, పీఎస్‌ నర్సింహ తదితరులు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున రోహత్గీ, ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలను మంత్రి మండలి సిఫారసు మేరకే ఉపయోగిస్తారు. షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీనిని స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమిషనర్‌ నియామక అధికారం గవర్నర్‌కే తప్ప రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

రమేష్‌కుమార్‌ నియామకం కూడా అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకే జరిగింది. కమిషనర్‌ నియామక సిఫారసు అధికారం మంత్రి మండలికి లేదంటే నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు. అధికరణ 243కే, అధికరణæ 243 జెడ్‌ఏ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు ఉంది’ అని చెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రోహత్గీ విన్నవించారు. దర్మాసనం జోక్యం చేసుకుని రాజ్యాంగ నైతికత ప్రాతిపదికన ఆర్డినెన్స్‌ రద్దు చేయడం తొలిసారి చూస్తున్నామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం స్టే ఇవ్వలేమని, ప్రభుత్వం తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. రెండు వారాల తరువాత పూర్తిస్థాయి వాదనలు వింటామని చెబుతూ నిమ్మగడ్డ తదితరులకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement