నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతాం
అనంతపురం అగ్రికల్చర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పథకం ప్రకారం దాడులు సాగిస్తున్న టీడీపీ దౌర్జన్యకాండకు ప్రజల సహకారంతో చరమగీతం పాడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై భౌతిక దాడులకు పూనుకోవడం చంద్రబాబు నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడిని నిరసిస్తూ పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. టీడీపీ నేతలకు మంచి బుద్దిప్రసాదించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హెచ్.నదీం అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయయాదవ్ తదితరులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకే రక్షణ కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వం సామాన్య వర్గాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేపై దాడి చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
అందరు చూస్తుండగానే కారు అద్దాలు ధ్వంసం చేసి గొట్టిపాటి రవిపై దాడులకు తెగబడుతున్నా పోలీసు యంత్రాంగం నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దాడులు ఇలాగే కొనసాగిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గొట్టిపాటిపై జరిగిన దాడిపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ గుండాగిరి నశించాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.యోగీశ్వర్‌రెడ్డి, రైతు విభాగం, ఎస్టీ సెల్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు యూపీ నాగిరెడ్డి, పాలె జయరామ్‌నాయక్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, యూత్ సిటీ కమిటీ అధ్యక్షుడు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు, అధికార ప్రతినిధులు పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, చింతకుంట మధు, వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ఓబుళపతి, అశోక్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం నాయకురాళ్లు రుద్రంపేట కృష్ణవేణి, అంకిరెడ్డి ప్రమీళ, దేవి, నాగలక్ష్మి, మునీర, హజరాబీ, షానాజ్, శోభ, కార్పొరేటర్లు సరోజమ్మ, ఫక్కీరమ్మ, పార్టీ నాయకులు ప్రసాదరెడ్డి, మార్కెట్‌మల్లి, గోపాల్‌మోహన్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జేఎం బాషా, ఖాదర్‌బాషా, అంజాద్, జిలాన్, బాలు, సతీష్, వలిపిరెడ్డి శివారెడ్డి, పురుషోత్తం, జంగాలపల్లి రఫీ, శివశంకర్, ఆది, నారాయణరెడ్డి, షేక్షావలీ, మంజునాథ్, షమీఅహ్మద్, హనుమంతు పాల్గొన్నారు.