
వేటకు మేట
నిషేధాజ్ఞలు ఎత్తివేయగానే ఉత్సాహంగా వేటకు బయలుదేరాల్సిన బోట్లు ముందుకు కదల్లేదు. ఇసుక మేట చేపల వేటకు అడ్డంకిగా మారింది. పాయ(రేవు) సముద్రంలో కలిసే మొగ ప్రాంతంలో పూడికతీత పనులు చేయకపోవటంతో హార్బర్ నుంచి సముద్రంలోకి రాకపోకలు సాగించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏ ఏటికాయేడు అభివృద్ధి పనులు జరుగుతాయని ఎదురు చూస్తున్న మత్స్యకారులకు నిరాశే మిగులుతోంది.
రేపల్లె/ నిజాంపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో విశాఖపట్నం తరువాత అంతటి ప్రాధాన్యం గల నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి ఎవరికీ పట్టడం లేదు. విదేశీ మారకద్రవ్యంతో పాటు వేలాది మందికి ఉపాది కేంద్రంగా మారిన ఈ హార్బర్‌పై అధికారులు శీతకన్ను వేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మత్స్యకార పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యంతో మరింత నష్టాల బాట పడుతోంది. సముద్రజీవాలు గుడ్లు పెట్టే సమయంలో అంటే ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు ప్రభుత్వం సముద్రంలో వేట నిషేధిస్తుంది. నెలన్నర విరామానంతరం మత్స్యకారులు ఉత్సాహంగా వేటకు బయలుదేరతారు. కానీ మొగ ప్రాంతంలో ఇసుక పూడిక కారణంగా బోట్లు హార్బర్ నుంచి సముద్రంలోకి రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొగ సామర్ధ్యాన్ని పెంచాలని క్రమబద్ధంగా పూడికతీత పనులు చేపట్టాలని మత్స్యకారులు ఏన్నో ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులు బదిరశంఖారావాలే అవుతున్నాయి. వేట చేసిన బోట్లు పోటు సమయంలో మాత్రమే హార్బర్‌కు వచ్చేందుకు అనువుగా ఉంటోంది. పాటు సమయంలో బోట్లు హార్బర్‌కు రావాలంటే మొగ దగ్గర ఇసుకమేట వేయటం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. పౌర్ణమికి ముందు సముద్రం పోటు మీద ఉండటం, ఈ నెల 9వ తేదీ మంచి రోజు కూడా కావడంతో నిషేధం తరువాత ఆ రోజు వేటకు బయలుదేరేందుకు మత్స్యకారులు బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు.
పెరిగిన బోట్లు..తరచూ వివాదాలు..
నిజాంపట్నం సముద్ర తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ పాయను అనువైన ప్రాంతంగా ఎంచుకుని అటవీశాఖకు చెందిన 38 ఎకరాల్లో 1980లో హార్బర్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా తొలి దశ పనుల్లో భాగంగా 50 బోట్లను నిలుపుదల చేసుకునే విధంగా జెట్టి నిర్మించారు. హార్బర్ ఏర్పాటుతో ఆప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. రోజురోజుకు బోట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
దీంతో పాటు ఇతర ప్రాంతాలైన కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, చీరాల ఓడరేవు, నెల్లూరు, మద్రాసుకు చెందిన బోట్లు మత్స్యసంపద విక్రయాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాకపోకలు సాగించటం మొదలుపెట్టాయి. దీంతో జెట్టి సమస్య జఠిలంగా మారింది. ప్రస్తుతం నిజాంపట్నంలో 200 మెక్‌నైజ్డ్ బోట్లు, 300 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. దీంతో పాటు అనునిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన మెక్‌నైజ్డ్ 100, మోటరైజ్డ్ బోట్లు 200 వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. నిత్యం వేటనుంచి వచ్చిన బోట్లు నిలుపుకునేందుకు జెట్టిలో ఖాళీ లేక మత్స్యసంపద దిగుమతి చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బోట్లు ఒకే సారి ఒడ్డుకు చేరుతుండటంతో నిలుపుకునే జాగా లేక పక్కపక్కనే నిలుపుదల చేయటం వల్ల అలలు, ఈదురుగాలుల ప్రభావానికి బోట్లు ఒకదానికి ఒకటి ఢీకొని దెబ్బతింటున్నాయి. దీంతో పాటు కనీసం జాగా దొరకక రేవు పక్కనే లంగర్లు, మడ చెట్లకు కట్టి దేవునిపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల తుఫానుల సమయంలో రేవు పక్కన ఉంచిన మూడు బోట్లు తాళ్లు తెగిపోయి సముద్రంలోకి వెళ్లిపోయాయి. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డాక సముద్రంలో గాలించగా బోట్లు కనిపించినప్పటికీ పూర్తిగా దెబ్బతినటంతో చాలావరకూ నష్టపోయారు. ఇవి చాలవన్నట్లు జెట్టీలో చోటుకోసం నిరంతరం ముష్టియుద్ధాలు చోటుచేసుకోవటం, పెద్దలు రాజీలు చేయటం పరిపాటిగా మారింది.