- రెండు రాష్ట్రాల మధ్యడీఎడ్ కాలేజీల వివాదం
- మైనారిటీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- తెలంగాణ విద్యాశాఖ కాలేజీల జాబితా ఇవ్వకముందే భర్తీకి ఏపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య మరో ‘విద్యా వివాదం’ రాజుకుంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) మైనారిటీ కాలేజీల్లో సీట్ల భర్తీ వ్యవహారంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో మైనారిటీ హోదా ఉన్న కళాశాల జాబితాను డీఈఈసెట్ కన్వీనర్‌కు తెలంగాణ విద్యాశాఖ ఇవ్వకముందే ఏపీలోని 26 కాలేజీలతోపాటు తెలంగాణలోని 43 మైనారిటీ కాలేజీల్లోనూ సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది.
ఈ నెల 11 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమిస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు ఆగమేఘాలపై సమావేశమై చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో గతేడాది మే లో ప్రభుత్వం డీఈఈసెట్-2014ను నిర్వహించింది. జూలైలో ఫలితాలు ఇచ్చింది. అయితే రెండు రాష్ట్రాల్లోని డీఎడ్ కాలేజీల్లో లోపాలు, అనుమతుల విషయంలో జాప్యం వల్ల కౌన్సెలింగ్ జరగలేదు. గత నెలలోనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించింది.
మరోవైపు మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాలను యాజమాన్యాలే ఒక కన్వీనర్‌ను ఎంపిక చేసుకొని ఆయన ద్వారా ప్రవేశాలు (డీఈఈసెట్-ఏసీ) చేపట్టుకునే అవకాశం ఉంది. అయితే రెండు రాష్ట్రాల్లోని మైనారిటీ కాలేజీలు ఒక కన్సార్షియంగా ఏర్పడి కన్వీనర్‌ను నియమించుకోవాలి. ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అందులో సభ్యులుగా ఉంటారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో 44 కాలేజీల యాజమాన్యాలు తమవి మైనారిటీ కాలేజీలని, రెగ్యులర్ కౌన్సెలింగ్ ద్వారా కాకుండా డీఈఈసెట్-ఏసీ ద్వారా తమ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తామని విద్యాశాఖకు తెలిపాయి.
ఇందులో భాగంగా 36 కాలేజీలు నేషనల్ మైనారిటీ కమిషన్ నుంచి పొందిన మైనారిటీ హోదా సర్టిఫికెట్లను, 8 కాలేజీలు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చిన మైనారిటీ హోదా సర్టిఫికెట్లను అందజేశాయి. నిబంధనల ప్రకారం జాతీయ మైనారిటీ కమిషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవని, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. దీనిప్రకారం 8 కాలే జీలకే మైనారిటీ హోదా ఉన్నట్లు తేల్చింది.
మిగిలిన కాలేజీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే, ఏపీ ప్రభుత్వం డీఈఈసెట్-ఏసీ కన్వీనర్‌ను నియమించింది. ఈ నెల 11 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 14న సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. తాము ఎన్ని కాలేజీలకు మైనారిటీ హోదా ఉందో తేల్చకముందే నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న తెలంగాణ విద్యాశాఖ సోమవారం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.