తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల బూందీ పోటులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. బూందీ తయారీకి వాడే బాండిళ్లు (పెనం) అతివేడి కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది డ్రై కెమికల్ పౌడర్‌తో మంటలు ఆర్పి వేశారు. గ్యాస్ సరఫరా నిలిపివేశారు. పోటు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.
డిప్యూటీ ఈవో కోదండ రామారావు, పోటు పేష్కార్ అశోక్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బాండిళ్లు కాలినట్టు గుర్తించి వాటిని తొలగించారు. గంట వ్యవధిలోనే తిరిగి బూందీ తయారీ ప్రారంభించారు. బూందీ పోటులో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, బాండిల్‌కు అంటుకుని ఉన్న నెయ్యి వ్యర్థాలు మాత్రమే కాలాయని కోదండ రామారావు తెలిపారు. ఘటనలో ఆస్తి నష్టం జరగలేదన్నారు.