పోలవరం రూరల్, న్యూస్‌లైన్ : గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి నదిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం ఏజెన్సీలోని 26 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామయ్యపేట సమీపంలోని తవ్వు కాలువలోను, కొత్తూరు గ్రామ సమీపంలోని లో-లెవెల్ కాజ్‌వే వద్ద సుమారు ఆరు అడుగుల ఎత్తును నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల గిరిజనులు పడవలపై వాటిని దాటి కాలినకడన శనివారం ప్రయాణం సాగించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి అధికంగా నీరు చేరడంతో క్రమేపీ వరద పెరుగుతోంది.
శుక్రవారం రాత్రి పోలవరం మండలంలో కుంభ వర్షం కురిసింది. 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇసుక కాలువ పొంగి ప్రవహించింది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరి పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాట్లు వేసిన పొలాలు ముంపునకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో కడె మ్మ స్లూయిజ్ ద్వారా నీరు పొలాల్లోకి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాంతంలో ఊడ్చిన పొలా లు, ఆకు మడులు ముంపునకు గురయ్యాయి.
పెరిగిన నీటి మట్టం
కొవ్వూరు, న్యూస్‌లైన్ : గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద పెరుగుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీరు ఒడ్డును తాకుతూ ప్రవహిస్తోంది. స్నానఘట్టం వద్ద మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈనెల మొదటివారంలో వచ్చిన వరద ప్రభావానికి పేరుకుపోయిన ఒండ్రు మట్టి, ఇసుక మేటలు ఇంకా అలాగే ఉన్నాయి. అప్పట్లో వారం రోజులపాటు ఇక్కడ ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నేటికీ రెండు అడుగుల మేర వరదనీరు నిలిచి ఉంది.
ఎగువున భద్రాచలంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో క్రమేణా కొవ్వూరు, ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. శనివారం ఉదయం నుంచి భద్రాచలం వద్ద నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు 42.60 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 42.10 అడుగులకు స్వల్పంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 7.40 అడుగులున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 9.50 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు ఆనకట్టకున్న మొత్తం 175 గేట్లను ఎత్తివేసి 7 లక్షల 81వేల 533 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.
మళ్లీ వరద భయం
Published Sun, Aug 18 2013 5:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement