వరంగల్, న్యూస్‌లైన్ : మేడారం మహా జాతర పనులు నిర్వహించేందుకు కావాల్సిన నిధులు విడుదల కావడం లేదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం లభించక రెండు నెలల నుంచి ఈ ఫైల్ సీఎం పేషీలో పెండింగ్‌లో పెట్టారు. జాతరకు కొద్దిరోజుల ముందే నిధులు విడుదల చేస్తే... హడావుడిగా పనులు చేయాల్సి ఉంటుందని, కొంత ముందుగా అనుమతిస్తే పనులు సక్రమంగా చేస్తామంటూ అధికారులు నివేదించినా సీఎం పేషీ నుంచి సమాధానం రావడం లేదు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే పలు రోడ్ల కోసం ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో రూ.32.25 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు.
రెండేళ్ల కిందట జాతర సందర్భంగా రూ.22 కోట్లతో రోడ్లు నిర్మించామని, ఆ రోడ్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లోని రోడ్లకు మరమ్మతులు, వెడల్పు చేస్తే జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని జిల్లా యంత్రాంగం నివేదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే మహా జాతర సందర్భంగా రోడ్ల కోసం ముందస్తు నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపించినా... సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేయడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చూపిస్తూ తెలంగాణలో అతిపెద్ద మహా జాతరపై నిర్లక్ష్యం చేస్తున్నారు. మేడారం మహా జాతరకు ప్రతీసారి నిధుల సమస్య వస్తున్నది.
ముందస్తుగా నిధులివ్వకుండా... నెల రోజుల ముందు హడావుడిగా టెండర్లు వేస్తున్నారు. దీంతో రోడ్ల పనుల్లో నాణ్యత ఉండడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది హడావుడిగా చేపట్టిన ఏటూరునాగారం హైవే రోడ్టు పనులు చాలా ఆధ్వాన్నంగా మారిపోయాయి. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ క్వాలిటీ కంట్రోల్ విభాగం సైతం తప్పు పట్టింది. అయితే ఆగమాగంగా పనులు చేయించారని, అధికారులు చెప్పినట్టుగా వాటర్ క్యూరింగ్ సరిగా చేసే సమయం లేదని, వేసిన కొద్ది రోజుల్లోనే భారీ వాహనాలు రోడ్డుపైనుంచి వెళ్లడంతో దెబ్బతిన్నాయంటూ కాంట్రాక్టర్లు తప్పును కప్పి పుచ్చుకున్నారు. అయితే ఈసారి అదే తప్పు మళ్లీ జరుగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక చేపట్టింది. 25 రోడ్లను మరమ్మతు చేయాలని గుర్తించారు. వీటి కోసం రూ.32.25 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆగస్టు వరకే నిధుల విడుదలకు మోక్షం లభిస్తే... ఆరు నెలల కాలంలో రోడ్లను నిర్మించవచ్చని నాణ్యతపై కట్టుదిట్టంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రధాన రహదారులివే..
రూ.4 కోట్లతో సమ్మక్క-సారలమ్మ దేవాలయం నుంచి జంపన్న స్నానఘట్టాల వరకు డబుల్ లేన్ రోడ్డును ఫోర్‌లేన్‌గా మార్చనున్నట్లు అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అదే విధంగా రూ.2 కోట్లతో పస్రా-బయ్యక్కపేట రోడ్, రూ.2 కోట్లతో పస్రా, గుండాల రోడ్ ప్రారంభం నుంచి మోదుగులగూడెం వరకు, రూ.1 కోటితో పస్రా-బయ్యక్కపేట శివారు వరకు రోడ్లను మరమ్మతు, వెడల్పు చేసేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా జంపన్నవాగు హైలెవల్ బ్రిడ్జి వద్ద డబుల్ లేన్ రోడ్డుకు రూ.2 కోట్లు, నార్లాపూర్-నందిగామ వరకు రోడ్డును మెరుగపరచడానికి రూ.4 కోట్లు, బయ్యక్కపేట-దూదేకులపల్లి రోడ్డుకు రూ.2 కోట్లు, ఆజాంనగర్ లింకు రోడ్డుకు రూ.2 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తాడ్వాయి-నార్లాపూర్ రోడ్డు మరమ్మతుకు రూ.1.50 కోట్లు, ఇదే రోడ్డు 6 కి.మి. నుంచి 11/8 కి.మి. వరకు మరమ్మతుల కోసం రూ.1.75 కోట్లు, పస్రా-బయ్యక్కపేట రోడ్డు మరమ్మతుకు రూ.1.50 కోట్లు, పస్రా-బయ్యక్కపేట రోడ్డు మరమ్మతుకు రూ.1.80 కోట్లు, రాంపూర్-నందిగామ ప్రారంభం నుంచి 2/4 వరకు, 7నుంచి 13 కి.మి. వరకు మరమ్మతుల కోసం రూ.1.50 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. వీటితో పాటు మరికొన్ని రోడ్లకు నిధులు విడుదల చేయాలని నివేదించారు.
జాతర పైసలు ఆగినయ్!
Published Thu, Sep 5 2013 4:10 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement