టంగుటూరు, న్యూస్‌లైన్: వ్యవసాయ రుణాలను రద్దు చేసే సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి లేదని.. ఈ ప్రకటనలపై రైతులు ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం డి.సురేంద్రరావు తెలిపారు. టంగుటూరులో ఆ బ్యాంకు ఏటీఎంను గురువారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
వ్యాపారుల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన సెక్యూర్డు ఓవర్ డ్రాఫ్టు విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రెండేళ్లుగా లెసైన్స్ పొంది చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ.. టర్నోవర్ లేదా ఇన్‌కంట్యాక్స్ వివరాలు చూపితే 100 శాతం సెక్యూరిటీతో రుణం అందిస్తామన్నారు. ఉదాహరణకు *75 రూపాయల రుణం కోరితే.. *100 విలువైన సెక్యూరిటీ ఉండాలని చెప్పారు. అయితే రూరల్ సెక్యూరిటీ కాకుండా.. కేవలం అర్బన్, సెమీ అర్బన్ సెక్యూరిటీ మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
రుణాలను రెండేళ్లకోసారి పరిశీలించి.. తిరిగి కొనసాగించే అవకాశం ఎప్పుడూ ఉంటుందన్నారు. వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన పలు డాక్యుమెంట్ల జోలికిపోమని.. కేవలం టర్నోవర్ తెలిపితే చాలన్నారు. చిరువ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.
రూపాయి వడ్డీకే రుణాలు
రైతులకు బంగారంపై కేవలం 1 వడ్డీకే రుణాలు ఇస్తామని డీజీఎం చెప్పారు. ఎకరాకు అత్యధికంగా *20 వేలు ఇస్తామని, ఏడాదిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులో పరిమిత వడ్డీకి ఇచ్చే వ్యవసాయ రుణాలకు.. బంగారు రుణాలతో సంబంధం లేదన్నారు.
త్వరలో 22 ఏటీఎంలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మార్చి 14 నాటికి మరో 22 ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 13న బి.నిడమలూరు, మార్టూరు, పూనూరుల్లో ప్రారంభిస్తామని, అలాగే ఉలవపాడులో నూతన బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి తమ బ్యాంకు వ్యాపారం *5,500 కోట్లు ఉందని, మార్చి నాటికి *6,200 కోట్లకు పెంచాలని లక్ష్యం విధించినట్లువివరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ యు.రమణరావు, పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య, సర్పంచ్ బెల్లం జయంత్‌బాబు, పాల కేంద్రం అధ్యక్షుడు కామని విజయకుమార్, పొగాకు వ్యాపారులు పాల్గొన్నారు.
వ్యవసాయ రుణాల రద్దు దుర్లభం
Published Fri, Feb 7 2014 2:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement