రైతులకు కొత్త రుణాలు ఇవ్వం | will not give new loans to farmers, say andhra bank cmd | Sakshi
Sakshi News home page

రైతులకు కొత్త రుణాలు ఇవ్వం

Published Sun, Aug 3 2014 1:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతులకు కొత్త రుణాలు ఇవ్వం - Sakshi

రైతులకు కొత్త రుణాలు ఇవ్వం

ముందు బకాయిలు కట్టాల్సిందే : ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
రైతులు పాత బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) సీవీఆర్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు ఉండగా కొత్త రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు వారి ఖాతాల్లో నగదు ఉన్నా రుణాలు చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి రుణ చరిత్ర దెబ్బతిని భవిష్యత్తులో ఎటువంటి అప్పులూ పుట్టని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రన్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేసే అవకాశం కనిపించడం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆర్‌బీఐ స్పష్టతతో ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ఆర్‌బీఐతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ రుణాలను రీ షెడ్యూల్ చేస్తే దేశంలో రుణ క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మహారాష్ట్రతో సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ సమయంలో ఇక్కడ నిబంధనలు పక్కకుపెట్టి రీ షెడ్యూల్ ప్రకటిస్తే ఆ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన డిమాండ్లు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అందువల్లే ఆర్‌బీఐ రీ షెడ్యూల్‌కు ఆసక్తి చూపడం లేదన్నారు.
 
 ప్రభుత్వాలు మాఫీ చేస్తాయన్న ఆశతో రైతులు రుణాలు చెల్లించడం లేదని, దీంతో వారి రుణ ఖాతాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏలు)గా మారడమే కాకుండా వారి రుణ చరిత్ర దారుణంగా దెబ్బతింటుందని చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రుణ ఖాతా ఎన్‌పీఏగా మారితే.. అతనికి హౌసింగ్, కారు, వ్యక్తిగత రుణాలు ఉండి సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ, వాటిని కూడా ఎన్‌పీఏలుగానే పరిగణిస్తారని తెలి పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలకు చెందిన 89.5 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడం వల్ల వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అన్నారు. తొలి త్రైమాసికంలో రూ.1,078 కోట్ల వ్యవసాయ రుణాలు ఎన్‌పీఏలుగా మారాయని, ఈ ఖాతాదారులు తీసుకున్న రూ.300 కోట్ల ఇతర రుణాలను కూడా ఎన్‌పీఏలుగా ప్రకటించాల్సి వచ్చిందని రాజేంద్రన్ తెలిపారు. రుణ మాఫీ మరింత ఆలస్యమైతే ఈ మూడు నెలల్లో మరో రూ.2,000 కోట్లు ఎన్‌పీఏలుగా మారతాయని చెప్పారు. రుణమాఫీని ఆలస్యం చేస్తుండటం వల్ల రైతులకు ఎటువంటి అప్పులూ పుట్టని పరిస్థితిని కల్పిస్తున్నాయని రాజేంద్రన్ పరోక్షంగా ప్రభుత్వాలను విమర్శించారు. రబీ పంటలు బాగుండటంతో చాలా మంది రైతులు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. అందువల్ల ముందుగా రైతులను బకాయిలు చెల్లించాలని చెప్పి, వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా, రుణాలు కట్టడానికి ముందుకు రాకుండా రుణమాఫీపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల పరిస్థితుల్లో కొంత మార్పు కనపడుతోందని, రుణాలు చెల్లించడానికి మహిళలు ముందుకొస్తున్నారని రాజేంద్రన్ తెలిపారు.
 
 రుణమాఫీ చేయలేం : ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
 సాక్షి, తిరుపతి/తిరుమల : ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టం చేశారు. ఆమె శనివారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. ఆమెతోపాటు ఎస్‌బీఐ సీజీఎం సీఆర్ శశికుమార్, జీఎం జీకే కన్సల్, డీజీఎం నీరజ్ నిగమ్, తిరుపతి డీజీఎం బాల సుబ్రమణియన్, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి మార్గదర్శకాలూ జారీ కాలేదన్నారు. రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్‌బీఐకి అసమగ్ర సమాచారాన్ని ఇచ్చిందని తెలిపారు.  అందుకే ఆర్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు. రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐదే తుది నిర్ణయమన్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకే రుణ మాఫీపైన, రీ షెడ్యూల్ పైనా స్పందిస్తామని చెప్పారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. తిరుమల చాలా ప్రశాంతంగా ఉందని, మంచి అనుభూతినిచ్చిందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement