జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని రక్షించుకునేందుకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రంగంలోకి దిగింది.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని రక్షించుకునేందుకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రంగంలోకి దిగింది. తమ దూతలను పరిశీలకుల రూపంలో జిల్లాలకు పంపుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక కోసం ఈ నెల 18,19 తేదీల్లో ఇద్దరు దూతలు ఢిల్లీ నుంచి వచ్చి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఏఐసీసీ నుంచి రాజిరెడ్డి బసవరాజు, పీసీసీ నుంచి సీవీ శేషారెడ్డిలు స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో అభిప్రాయ సేకరణ చేపడతారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు జడా బాలనాగేంద్రం ఆధ్వర్యంలో పలువురు నేతలు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏఐసీసీ దూతల పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరిస్తారు.
మొదటి రోజు 18వ తేదీ ఉదయం 10 గంటలకు దర్శి నియోజకవర్గంతో ప్రారంభిస్తారు. 11 గంటలకు మార్కాపురం, 12 గంటలకు యర్రగొండపాలెం, మధ్యాహ్నం 3 గంటలకు గిద్దలూరు, 4 గంటలకు కనిగిరి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తారు. రెండో రోజు 19వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు, 10 గంటలకు కొండపి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. అసెంబ్లీల పరిధిలో వచ్చే అభిప్రాయం ఆధారంగా పార్లమెంట్ అభ్యర్థిత్వంపై కూడా ఒక అవగాహనకు వస్తారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని బాలనాగేంద్రం విజ్ఞప్తి చేశారు.
జగన్‌ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలి
సమైక్యాంధ్ర విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు బాలనాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్‌లు హితవు పలికారు. రాష్ట్ర విభజనం అంశంలో విషయంలో జగన్ స్టాండ్ సరైందన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తూ ఏ ప్రాంతానికీ న్యాయం చేసే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్ర విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండానే సీమాంధ్ర ప్రజలను మోసం చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని వ్యంగ్యంగా అన్నారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఇచ్చిన లెటర్‌ను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబుపై జిల్లా టీడీపీ నేతలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు పాతాలపు కోటేశ్వరరావు, పార్స కోటయ్య, చెరుకూరి ఆదిలక్ష్మి, బిళ్లా చెన్నయ్య, షేక్ కరిముల్లా పాల్గొన్నారు.