dcc office
-
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్‌టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవం
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్ సిటీ : దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృత్యుంజయం మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించి రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత రాజీవ్‌దేనన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌లోని విగ్రహానికి పూలమాలలు వేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేవారు. ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొంటెల రత్నాకర్, దిండిగాల మధు, నాగి శేఖర్, గౌతమ్ అర్జున్‌రెడ్డి, గందె మాధవి, మాదాసు శ్రీనివాస్, చెర్ల పద్మ, మూల జైపాల్, వీరారెడ్డి, మగ్దుం అలీ, పడాల శంకరయ్య, చంద్రశేఖర్, వేల్పుల వెంకటేశ్, చెన్నాడి అజిత్‌రావు, బాసెట్టి కిషన్, కల్వల రామచందర్, అక్బర్ అలీ, చిలుక ప్రవీణ్, పటేల్ సుధీర్‌రెడ్డి, ముద్దసాని క్రాంతి, అబ్దుల్ రహమాన్, ములుగు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ ఆశయసాధనకు కృషి
కడపౖవెఎస్సార్ సర్కిల్: రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు కృషి చేద్దామంటూ డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. రాజీవ్‌పార్కు, రిమ్స్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి, డీసీసీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు దేశం శ్రాస్త, సాంకేతిక రంగాలల్లో అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్‌గాంధీ కృషియే కారణమన్నారు. యువతకు 21సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు.అనంతరం అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, జిల్లా సేవాదళ్ చెర్మెన్ చీకటి చార్లెస్, జిల్లా సేవాదళ్ మహిళా చెర్మెన్ గౌసియా, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుజాతరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ చైర్మన్ విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సమావేశం రసాభాస
► రచ్చకెక్కిన విభేదాలు ► పరిశీలకుల ముందే తోపులాట, వాగ్వివాదాలు, నినాదాల హోరు ► కటుకం వర్సెస్ ఆరెపల్లి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి రసాభాసగా మారింది. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ పలు విమర్శలు చేస్తూ వేదిక మీద బైఠాయించారు. వాగ్వివాదం, తోపులాట, నిరసనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. - కరీంనగర్ కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. పరిశీలకుల ముందే తోపులాటలు, వాగ్వివాదాలు, నినాదాల హోరుతో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గందరగోళంగా మారింది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం, 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం లక్ష్యంగా సోమవారం డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్ నాయకుల కీచులాట కారణంగా కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేకానంద, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పార్టీ జిల్లా ఇన్చార్జి పి.నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉజ్మషాకీర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, హర్కార్ వేణుగోపాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పలువురు కార్యకర్తలు మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు వద్దని, నాయకులు తమ గోడును పట్టించుకోవడం లే దని, టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నామని వాపోయూరు. టీఆర్ఎస్ ఇచ్చిన హమీల అమలుపై పోరాటంలో విఫలమవుతున్నామని నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారం అనుభవించిన మీరే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని, విభేదాలు మానుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, తాము అండగా ఉంటామని వివిధ నియోజకవర్గాల బ్లాక్ అధ్యక్షులు నాయకులకు చురకలంటించారు. ఆరెపల్లి వర్సెస్ కటుకం... ముందుగా కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీకి పుట్టగతులుండవన్నారు. స్వయాన తనకే అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయూరు. తీరు మార్చుకోకపోతే సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహంతో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం వైపు చూస్తు మాట్లాడారు. ‘దళితులంటే ఇంత అలుసా. ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేనంటే గౌరవం లేదా? గాంధీభవన్‌లో నా పేరిట స్వాగతం బ్యానర్లు కట్టిన వాళ్లను బెదిరిస్తారా? కార్యకర్తలను చిన్నచూపు చూడటం, గ్రూపులను ప్రోత్సహించడం మానుకోవాలి. ఈ రోజు జరిగే సమావేశానికి పత్రికల్లో నేను కూడా వస్తున్నట్లు తెలియపరిచే బాధ్యత లేదా? ఇంత అవమానాల మధ్య ఉండలేం. మరోసారి ఇలా అయితే చూస్తూ ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. ‘డీసీసీ కార్యాలయంలో శిలాఫలకం చెడిపోతే శుభ్రం చేసుకునే తీరిక లేదా? మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు పేరును చెరిపి వేసిన వారిని వదిలేశారు? డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరినా ఆయన పేరును శిలాఫలకంపై ఎందుకు చేరిపి వేయలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర పరిశీలకులు జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేసి కూర్చోబెట్టారు. దీంతో అసహనానికి గురైన కటుకం మృత్యుంజయం తాను అన్నింటికి సమాధానం చెబుతానని మైకు తీసుకోని లేవగానే... ఆరెపల్లి జోక్యం చేసుకోని ‘చేసిదంతా చేసి తమాషా చూస్తున్నావా? సమాధానం చెబితే ముక్కు నేలకు రాస్తా’ అనడంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఓ కార్యకర్త వేదికపైకి ఎక్కి మృత్యుంజ యంతో వాగ్వివాదానికి దిగడంతో వేదికపై ఉన్నవారు వారించారు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు, వాగ్వివాదాలతో గందరగోళం నెలకొంది. ఆరెపల్లి, ఆయన అనుచరులు వేదిక పైనుంచి కిందికి వచ్చి బైఠాయించారు. గొడవ సద్దుమణగకపోవడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకులు మహేశ్‌కుమార్‌గౌడ్ వేదికపై ఉన్నవారందరిని కిందికి దింపి సమావేశాన్ని కొనసాగించారు. సమావేశంలో బాబర్ సలీంపాషా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పాట రమేశ్, చేతి ధర్మయ్య, రేగులపాటి రమ్య, బోమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, ఉప్పరి రవి, దిండిగాల మధు, చెర్ల పద్మ, నాగి శేఖర్, వాసు, సురేందర్, ఉప్పుల అంజనీప్రసాద్, గందె మాధవి మహేశ్, అంజన్‌కుమార్, ఆకుల ప్రకాశ్, కెడం లింగమూర్తి, బోలిశెట్టి శివయ్య, బండ శంకర్, విజయరామారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలతో కన్నీరు పెట్టిస్తే అరిష్టమే
ఒంగోలు సబర్బన్ : అధికారం కోసం లేనిపోని హామీలిచ్చి అవి నెరవేర్చకుండా ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు అరిష్టమేనని..మహిళల ఉసురు ఊరికే పోదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంగోలు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో అందరినీ నమ్మించి ఓట్లేయించుకుని చంద్రబాబు అందలమెక్కారన్నారు. మ్యానిఫెస్టో అమలు చేయకుండా ఏడాదిపాటు సాగించిన చంద్రబాబు పాలనంతా డొల్లేనని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి నిలువునా ముంచిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని విడ గొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలిచ్చిన చంద్రబాబు ఆ బురదను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, నెల్లూరుకు చెందిన నాయకురాలు చేను సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్ విమల్, వేము శ్రీనివాసరావు, పర్రె నవీన్ రాయ్, గాదె లక్ష్మా రెడ్డి, ఎస్.కె.రసూల్, బొడ్డు సతీష్ పాల్గొన్నారు. -
పునర్ వైభవం తెచ్చేదెలా?
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఓడిపోయాం. కార్యకర్తల్లో నిస్తేజం ఆవరించింది. నాయకుల్లో గ్రూపు తగాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాయకత్వ పటిమ లోపించింది. ఎటుచూసినా పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని చక్కదిద్దేదెలా? పునర్ వైభవం తెచ్చేదెలా? .. కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ప్రశ్నలివి. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ కరీంనగర్: గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో తిరిగి జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాకు విచ్చేశారు. రాజకీయ ప్రణాళిక రూపకల్పన, కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, క్రమశిక్షణ ఉల్లంఘన, బూత్ స్థాయి మొదలు అన్ని స్థాయిలో పార్టీ ప్రక్షాళన వంటి అంశాలపై జిల్లా నాయకులతో చర్చించడంతోపాటు వారి అభిప్రాయాలను సేకరించడమే ప్రధాన అజెండాగా డీఎస్ పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు డీసీసీ కార్యాలయంలో డీఎస్ మకాం వేసి పైన పేర్కొన్న పలు అంశాలపై నాయకులతో చర్చించనున్నారు. నాలుగు గ్రూపులు జిల్లా నేతలను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 85 మంది నాయకులను చేర్చారు. టీపీసీసీ, డీసీసీ ఆఫీస్ బేరర్స్, జిల్లాస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఈ గ్రూపుల్లో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఒక్కో గ్రూపుతో రెండు గంటలపాటు డీఎస్ భేటీ అవుతారు. చర్చించే అంశాలివే.. డీసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలు టీపీసీసీ ఇటీవల రూపొందించిన 11 పేజీల బుక్‌లెట్‌ను గ్రూపు సభ్యులకు అందజేసి ఆ మేరకు సలహాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ వ్యతిరేకతపై రాజీలేని పోరాట పంథాను అనుసరించలేకపోవడానికి ఎదురవుతున్న అడ్డంకులేమిటి? ఏ వర్గాలు జిల్లాలో పార్టీని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి? ఎలాంటి అధికారాలు, బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లా, బ్లాక్, మండల, బూత్ కమిటీలు చైతన్యమవుతాయి? టీపీసీసీ, డీసీసీలు తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు తిరస్కరించకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకోవాలి? ముఖ్య నాయకులంతా పార్టీ శ్రేణులకు జవాబుదారీగా ఉండాలంటే ఏం చేయాలి? క్రమశిక్షణ చర్యలను నిజాయతీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? ఏడాది ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ప్రజల్లో పలుకుబడి ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్ధికి తోడ్పాటునందించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? విద్యార్థి, యువతను ఆకర్షించడమెలా? సోషల్ మీడియా, టీవీ, ప్రింట్ మీడియా సహకారాన్ని పొందేదెలా? వంటి అంశాలపై డీఎస్ ఆయా గ్రూపుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. చర్చల అనంతరం డీసీసీ అధ్యక్షుడితో కలిసి డీఎస్ అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ అధిష్టానానికి నివేదికను పంపనున్నారు. -
నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తా: భట్టి
ఖమ్మం, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పటడం సంతోషకరమని, ఈ ప్రాంతంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని నవ తెలంగాణ నిర్మాణం కోసం మేనిఫెస్టో తయారు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న జిల్లా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టోలో చోటు కల్పిస్తామని చెప్పారు. కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబుతోపాటు తెలంగాణ నేతలతో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అంశాలను అన్నివర్గాల ప్రజలనుంచి సేకరిస్తామని తెలి పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్ని కల్లో కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. -
బలప్రదర్శన
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే విజయ్ వట్టీ తివార్ గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్టీ నూతన విధానంలో భాగంగా అభిప్రాయ సేకరణ, వ్యక్తిగత అంశాల పరిశీలన ద్వారా పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన జిల్లాకు వచ్చారు. డీసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8గంటల వరకు ఆయన ఆశావాహుల నుంచి దరఖాస్తులు, మద్దతుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా నాయకులు బలప్రదర్శనకు దిగారు. పోటాపోటీగా నినాదాలతో డీసీసీ కార్యాలయం మార్మోగింది. 000 ముందుగా ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని దరఖాస్తు అందచేశారు. ఎమ్మెల్యేకు పోటీ చేస్తారా, ఎంపీకి పోటీ చేస్తారా? అని పరిశీలకుడు ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం, మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశిస్తే దేనికైనా పోటీ చేస్తానని అడ్లూరి సమాధానమిచ్చారు. ఆయనకు మద్దతుగా సర్పంచ్‌లు, మండల శాఖల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పరిశీలకుడిని కలిశారు. యూత్ కాంగ్రెస్ లోక్‌సభ స్థానం ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి ప్రకాశ్, అంబేద్కర్ సంఘం నాయకుడు జానపట్ల స్వామి తమకు టికెట్ ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశి స్తున్న మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి వేలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా వచ్చారు. కార్యాలయం లోపల పరిశీలకుడి ని కలిసి తన అర్హతను వివరించిన గీట్ల, బ యటకు వస్తే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవచ్చని సూచించారు. దీంతో పరి శీలకుడు ఫంక్షన్‌హాల్‌కు వచ్చి అభిప్రాయా లు సేకరించారు. గీట్లకు టికెట్ ఇచ్చి కాంగ్రె్ స పార్టీని బతికించండంటూ కొంతమంది పరిశీలకుని కాళ్లు పట్టుకోవడంతో నాయకు లు వారించారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గుర్రాల మల్లేశం, కోట రాంరెడ్డి, మాదాసు వెంకన్న పటేల్, గజభీంకర్ జగన్, గుర్రాల లావణ్య, కన్న అశోక్‌గౌడ్, రవీందర్, మహేందర్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ్ తదితరులు గీట్లకు టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు తన మద్దతుదారులతో పరిశీలకుడిని కలిశారు. మాజీ జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ నాయకులతో బలప్రదర్శన చేశారు. కొక్కిస రవీందర్‌గౌడ్, సురేశ్‌గౌడ్, మహేశ్వర్‌రావు, బొల్లం లక్ష్మణ్, కొమురయ్య తదితరులు భానుప్రసాద్‌రావుకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయనకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యపారిశ్రామిక సంస్థ చైర్మన్ చేతి ధర్మయ్య తన మద్దతుదారులతో వచ్చారు. బలహీనవర్గాల కోటాలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ ఈర్ల కొమురయ్య, నాయకులు సి.సత్యనారాయణరెడ్డి, వేమల రామ్మూర్తి తమకు అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కౌశిక హరి భారీ ప్రదర్శనతో వచ్చి పరిశీలకుడిని కలుసుకున్నా రు. కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్‌రావు, బాబర్‌సలీంపాషా తమ మద్దతుదారుల నినాదాల నడుమ దరఖాస్తు చేసుకున్నారు. గంట సత్యనారాయణరెడ్డి, బడికెల రాజలింగం, రియాజ్‌అహ్మద్, రాయమల్లుగౌడ్, తానిపర్తి గోపాల్‌రావు తమకు టికెట్ ఇవ్వాలంటూ బయోడేటా సమర్పించారు. మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే టికెట్ ఇవ్వాలంటూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్‌రావు, డీసీసీ అధికారప్రతినిధి శశిభూషణ్కాచె తదితరులు పరిశీలకునికి దరఖాస్తు అందచేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జానపట్ల స్వామి దరఖాస్తు చేసుకున్నారు. గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే లోకసభతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకుంటామని నేతకాని సంఘం నాయకులు వినతిపత్రం అందచేశారు. నేతకాని కులస్తుల ఓట్లు ఈ సెగ్మెంట్ పరిధిలో రెండు లక్షల పైచిలుకు ఉన్నాయని, ఆ కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తే గెలుపుఖాయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం నర్సయ్య, పుల్లయ్య కాంబ్లి కోరారు. ఇప్పటివరకు మాదిగ కులానికి పార్టీ అవకాశం ఇవ్వలేదని, ఈసారి టికెట్ మాదిగలకే ఇవ్వాలని కాసిపేట లింగయ్య విన్నవించారు. ఓపిగ్గా అభిప్రాయ సేకరణ ఆశావాహులు, మద్దతుదారుల నుంచి పరిశీ లకుడు ఓపిగ్గా అభిప్రాయాలు విన్నారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలను అడగడంతో పా టు, మద్దతునిస్తున్న నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులను ఎందుకు ఆ నాయకుడికి మద్దతునిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సదరు నియోజకవర్గం పరిస్థితి ఏమి టి, గతంలో పార్టీ ఎందుకు గెలవలేకపోయింది, ప్రత్యర్థి పార్టీ ఎందుకు విజయం సాధించిందనే వివరాలు ఆరా తీశారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులతో పరిశీలకుడు ప్రత్యేకంగా సంభాషించా రు. ముకుందరెడ్డికి టికెట్ ఇవ్వమంటున్నారు... మీకోసం ఎందుకు అడగడం లేదంటూ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఆయనైతేనే అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతారని వారు బదులిచ్చారు. ముకుందరెడ్డి కో డలుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంద ని ఆరా తీయగా, ఆయనకే అవకాశం ఇవ్వాలంటూ నా యకులంతా కోరారు. రామగుండంలో మైనార్టీ కో-ఆర్డినేటర్లు అంటూ వినతిపత్రం ఇవ్వడంపై పరిశీలకుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది మైనార్టీ కో-ఆర్డినేటర్లు ఉంటారని నిలదీ శారు. గ్రూపుకో కో-ఆర్డినేటర్ ఉన్నట్లున్నారని, ఇలాంటి వ్యవహారం నడవద న్నా రు. తాను సేకరించిన పేర్లను నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున తయారుచేసి రాహుల్‌గాంధీ కి ఇస్తామని విజయ్ తెలిపారు. డీసీసీ అధ్యక్షు డు కొండూరు రవీందర్రావు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. -
ఏఐసీసీ దూతలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని రక్షించుకునేందుకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రంగంలోకి దిగింది. తమ దూతలను పరిశీలకుల రూపంలో జిల్లాలకు పంపుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక కోసం ఈ నెల 18,19 తేదీల్లో ఇద్దరు దూతలు ఢిల్లీ నుంచి వచ్చి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఏఐసీసీ నుంచి రాజిరెడ్డి బసవరాజు, పీసీసీ నుంచి సీవీ శేషారెడ్డిలు స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో అభిప్రాయ సేకరణ చేపడతారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు జడా బాలనాగేంద్రం ఆధ్వర్యంలో పలువురు నేతలు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏఐసీసీ దూతల పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరిస్తారు. మొదటి రోజు 18వ తేదీ ఉదయం 10 గంటలకు దర్శి నియోజకవర్గంతో ప్రారంభిస్తారు. 11 గంటలకు మార్కాపురం, 12 గంటలకు యర్రగొండపాలెం, మధ్యాహ్నం 3 గంటలకు గిద్దలూరు, 4 గంటలకు కనిగిరి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తారు. రెండో రోజు 19వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు, 10 గంటలకు కొండపి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. అసెంబ్లీల పరిధిలో వచ్చే అభిప్రాయం ఆధారంగా పార్లమెంట్ అభ్యర్థిత్వంపై కూడా ఒక అవగాహనకు వస్తారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని బాలనాగేంద్రం విజ్ఞప్తి చేశారు. జగన్‌ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలి సమైక్యాంధ్ర విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు బాలనాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్‌లు హితవు పలికారు. రాష్ట్ర విభజనం అంశంలో విషయంలో జగన్ స్టాండ్ సరైందన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తూ ఏ ప్రాంతానికీ న్యాయం చేసే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్ర విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకుండానే సీమాంధ్ర ప్రజలను మోసం చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని వ్యంగ్యంగా అన్నారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఇచ్చిన లెటర్‌ను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబుపై జిల్లా టీడీపీ నేతలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు పాతాలపు కోటేశ్వరరావు, పార్స కోటయ్య, చెరుకూరి ఆదిలక్ష్మి, బిళ్లా చెన్నయ్య, షేక్ కరిముల్లా పాల్గొన్నారు. -
రచ్చ.. రచ్చ
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటనతో జిల్లాలో మసకబారిన కాంగ్రెస్ ప్రతిష్ట శుక్రవారం డీసీసీ కార్యాలయంలో చోటు చేసుకున్న వివాదంతో మరింత మంట గలిసింది. కాకినాడ మహిళా కాంగ్రెస్ కమిటీ నియామకంలో నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధం రచ్చకెక్కింది. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు తీరుపై మండిపడ్డ కాకినాడ మాజీ మేయర్ సరోజ పలువురు మహిళా కార్యకర్తలతో కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వివాదాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఇరువర్గాల వారూ రాజధానికి బయల్దేరారు. కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నామాల బ్రహ్మకుమారిని, ఇతర కార్యవర్గాన్ని ప్రతిపాదిస్తూ దొమ్మేటి మూడు రోజుల క్రితం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలికి సిఫార్సు చేశారు. అదేలేఖపై కమిటీని ఆమోదిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షురాలి సంతకంతో కమిటీని ప్రకటించారు. అయితే కాకినాడలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ వర్గానికి ఈ నియామకం రుచించలేదు. వాస్తవానికి నానాజీ వర్గీయులు వేరొక మహిళను ఆ పదవిలో నియమించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వారికి తెలియకుండా కమిటీని ప్రకటించడం కంటగింపుగా మారింది. మాజీ మేయర్ సరోజ ప్రతిపాదించిన కమిటీని ఎలా సిఫార్సు చేస్తారంటూ నానాజీ దొమ్మేటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షునికి కాకినాడ నగరంపై ఎలాంటి అధికారం లేదని దొమ్మేటిని నిలదీసినట్టు చెబుతున్నారు. దీంతో ఖిన్నుడైన దొమ్మేటి శుక్రవారం ఉదయం డీసీసీ కార్యాలయానికి వచ్చిన మాజీ మేయర్ సరోజతో సంవాదానికి దిగారు. ‘మేయర్‌గా చేసిన నాకు విలువ లేదా?’ అని ఆమె అనడంతో ‘మేయర్ చేస్తే నాకేంటీ?’ అంటూ దొమ్మేటి పరుష పదజాలంతో కించపరిచినట్టు సమాచారం. దీంతో ఆగ్రహించిన స రోజ డీసీసీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించా రు. కొందరు నేతలు సముదాయించబోయినా ఫలి తం లేకపోవడంతో దొమ్మేటి బయటకు వచ్చి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కాగా కాకినాడ మహిళా కాంగ్రెస్ కమిటీని రద్దు చేయించేం దుకు నానాజీ వర్గం శనివారం హైదరాబాద్‌లో పార్టీ నేతల వద్దకు వెళ్లనున్నట్టు తెలిసి ప్రత్యర్థి వర్గం కూడా రాజధానికి బయల్దేరింది. అయితే కమిటీకి కేంద్ర మంత్రి పళ్లంరాజు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న సమాచారం ఆయన అనుచరుడైన నానాజీ వర్గీయులకు షాక్ ఇచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది.