పునర్ వైభవం తెచ్చేదెలా? | congress is trying to recollect previous name and fame in karim nagar | Sakshi
Sakshi News home page

పునర్ వైభవం తెచ్చేదెలా?

Published Sun, Feb 1 2015 9:18 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress is trying to recollect previous name and fame in karim nagar

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఓడిపోయాం. కార్యకర్తల్లో నిస్తేజం ఆవరించింది. నాయకుల్లో గ్రూపు తగాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాయకత్వ పటిమ లోపించింది. ఎటుచూసినా పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని చక్కదిద్దేదెలా? పునర్ వైభవం తెచ్చేదెలా? .. కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ప్రశ్నలివి.     - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
కరీంనగర్: గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో తిరిగి జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాకు విచ్చేశారు. రాజకీయ ప్రణాళిక రూపకల్పన, కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, క్రమశిక్షణ ఉల్లంఘన, బూత్ స్థాయి మొదలు అన్ని స్థాయిలో పార్టీ ప్రక్షాళన వంటి అంశాలపై జిల్లా నాయకులతో చర్చించడంతోపాటు వారి అభిప్రాయాలను సేకరించడమే ప్రధాన అజెండాగా డీఎస్ పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు డీసీసీ కార్యాలయంలో డీఎస్ మకాం వేసి పైన పేర్కొన్న పలు అంశాలపై నాయకులతో చర్చించనున్నారు.
 
నాలుగు గ్రూపులు

జిల్లా నేతలను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 85 మంది నాయకులను చేర్చారు. టీపీసీసీ, డీసీసీ ఆఫీస్ బేరర్స్, జిల్లాస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఈ గ్రూపుల్లో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఒక్కో గ్రూపుతో రెండు గంటలపాటు డీఎస్ భేటీ అవుతారు.
 
చర్చించే అంశాలివే..
డీసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలు టీపీసీసీ ఇటీవల రూపొందించిన 11 పేజీల బుక్‌లెట్‌ను గ్రూపు సభ్యులకు అందజేసి ఆ మేరకు సలహాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ వ్యతిరేకతపై రాజీలేని పోరాట పంథాను అనుసరించలేకపోవడానికి ఎదురవుతున్న అడ్డంకులేమిటి? ఏ వర్గాలు జిల్లాలో పార్టీని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి? ఎలాంటి అధికారాలు, బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లా, బ్లాక్, మండల, బూత్ కమిటీలు చైతన్యమవుతాయి? టీపీసీసీ, డీసీసీలు తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు తిరస్కరించకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకోవాలి?
 
ముఖ్య నాయకులంతా పార్టీ శ్రేణులకు జవాబుదారీగా ఉండాలంటే ఏం చేయాలి? క్రమశిక్షణ చర్యలను నిజాయతీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? ఏడాది ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ప్రజల్లో పలుకుబడి ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్ధికి తోడ్పాటునందించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? విద్యార్థి, యువతను ఆకర్షించడమెలా? సోషల్ మీడియా, టీవీ, ప్రింట్ మీడియా సహకారాన్ని పొందేదెలా? వంటి అంశాలపై డీఎస్ ఆయా గ్రూపుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. చర్చల అనంతరం డీసీసీ అధ్యక్షుడితో కలిసి డీఎస్ అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ అధిష్టానానికి నివేదికను పంపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement