కాకినాడ, న్యూస్‌లైన్ :
రాష్ట్ర విభజన ప్రకటనతో జిల్లాలో మసకబారిన కాంగ్రెస్ ప్రతిష్ట శుక్రవారం డీసీసీ కార్యాలయంలో చోటు చేసుకున్న వివాదంతో మరింత మంట గలిసింది. కాకినాడ మహిళా కాంగ్రెస్ కమిటీ నియామకంలో నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధం రచ్చకెక్కింది. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు తీరుపై మండిపడ్డ కాకినాడ మాజీ మేయర్ సరోజ పలువురు మహిళా కార్యకర్తలతో కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వివాదాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఇరువర్గాల వారూ రాజధానికి బయల్దేరారు. కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నామాల బ్రహ్మకుమారిని, ఇతర కార్యవర్గాన్ని ప్రతిపాదిస్తూ దొమ్మేటి మూడు రోజుల క్రితం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలికి సిఫార్సు చేశారు. అదేలేఖపై కమిటీని ఆమోదిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షురాలి సంతకంతో కమిటీని ప్రకటించారు. అయితే కాకినాడలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ వర్గానికి ఈ నియామకం రుచించలేదు. వాస్తవానికి నానాజీ వర్గీయులు వేరొక మహిళను ఆ పదవిలో నియమించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వారికి తెలియకుండా కమిటీని ప్రకటించడం కంటగింపుగా మారింది.
మాజీ మేయర్ సరోజ ప్రతిపాదించిన కమిటీని ఎలా సిఫార్సు చేస్తారంటూ నానాజీ దొమ్మేటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షునికి కాకినాడ నగరంపై ఎలాంటి అధికారం లేదని దొమ్మేటిని నిలదీసినట్టు చెబుతున్నారు. దీంతో ఖిన్నుడైన దొమ్మేటి శుక్రవారం ఉదయం డీసీసీ కార్యాలయానికి వచ్చిన మాజీ మేయర్ సరోజతో సంవాదానికి దిగారు. ‘మేయర్‌గా చేసిన నాకు విలువ లేదా?’ అని ఆమె అనడంతో ‘మేయర్ చేస్తే నాకేంటీ?’ అంటూ దొమ్మేటి పరుష పదజాలంతో కించపరిచినట్టు సమాచారం. దీంతో ఆగ్రహించిన స రోజ డీసీసీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించా రు. కొందరు నేతలు సముదాయించబోయినా ఫలి తం లేకపోవడంతో దొమ్మేటి బయటకు వచ్చి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కాగా కాకినాడ మహిళా కాంగ్రెస్ కమిటీని రద్దు చేయించేం దుకు నానాజీ వర్గం శనివారం హైదరాబాద్‌లో పార్టీ నేతల వద్దకు వెళ్లనున్నట్టు తెలిసి ప్రత్యర్థి వర్గం కూడా రాజధానికి బయల్దేరింది. అయితే కమిటీకి కేంద్ర మంత్రి పళ్లంరాజు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న సమాచారం ఆయన అనుచరుడైన నానాజీ వర్గీయులకు షాక్ ఇచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది.
రచ్చ.. రచ్చ
Published Fri, Sep 27 2013 11:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement