కాంగ్రెస్ సమావేశం రసాభాస
► రచ్చకెక్కిన విభేదాలు
► పరిశీలకుల ముందే తోపులాట, వాగ్వివాదాలు, నినాదాల హోరు
► కటుకం వర్సెస్ ఆరెపల్లి
జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి రసాభాసగా మారింది. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ పలు విమర్శలు చేస్తూ వేదిక మీద బైఠాయించారు. వాగ్వివాదం, తోపులాట, నిరసనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. - కరీంనగర్
కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. పరిశీలకుల ముందే తోపులాటలు, వాగ్వివాదాలు, నినాదాల హోరుతో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గందరగోళంగా మారింది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం, 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం లక్ష్యంగా సోమవారం డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్ నాయకుల కీచులాట కారణంగా కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేకానంద, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి పి.నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉజ్మషాకీర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, హర్కార్ వేణుగోపాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా పలువురు కార్యకర్తలు మాట్లాడారు. కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు వద్దని, నాయకులు తమ గోడును పట్టించుకోవడం లే దని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నామని వాపోయూరు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హమీల అమలుపై పోరాటంలో విఫలమవుతున్నామని నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారం అనుభవించిన మీరే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని, విభేదాలు మానుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, తాము అండగా ఉంటామని వివిధ నియోజకవర్గాల బ్లాక్ అధ్యక్షులు నాయకులకు చురకలంటించారు.
ఆరెపల్లి వర్సెస్ కటుకం...
ముందుగా కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీకి పుట్టగతులుండవన్నారు. స్వయాన తనకే అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయూరు. తీరు మార్చుకోకపోతే సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహంతో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం వైపు చూస్తు మాట్లాడారు. ‘దళితులంటే ఇంత అలుసా. ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేనంటే గౌరవం లేదా? గాంధీభవన్‌లో నా పేరిట స్వాగతం బ్యానర్లు కట్టిన వాళ్లను బెదిరిస్తారా? కార్యకర్తలను చిన్నచూపు చూడటం, గ్రూపులను ప్రోత్సహించడం మానుకోవాలి.
ఈ రోజు జరిగే సమావేశానికి పత్రికల్లో నేను కూడా వస్తున్నట్లు తెలియపరిచే బాధ్యత లేదా? ఇంత అవమానాల మధ్య ఉండలేం. మరోసారి ఇలా అయితే చూస్తూ ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. ‘డీసీసీ కార్యాలయంలో శిలాఫలకం చెడిపోతే శుభ్రం చేసుకునే తీరిక లేదా? మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు పేరును చెరిపి వేసిన వారిని వదిలేశారు? డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో చేరినా ఆయన పేరును శిలాఫలకంపై ఎందుకు చేరిపి వేయలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర పరిశీలకులు జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేసి కూర్చోబెట్టారు. దీంతో అసహనానికి గురైన కటుకం మృత్యుంజయం తాను అన్నింటికి సమాధానం చెబుతానని మైకు తీసుకోని లేవగానే... ఆరెపల్లి జోక్యం చేసుకోని ‘చేసిదంతా చేసి తమాషా చూస్తున్నావా? సమాధానం చెబితే ముక్కు నేలకు రాస్తా’ అనడంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
ఓ కార్యకర్త వేదికపైకి ఎక్కి మృత్యుంజ యంతో వాగ్వివాదానికి దిగడంతో వేదికపై ఉన్నవారు వారించారు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు, వాగ్వివాదాలతో గందరగోళం నెలకొంది. ఆరెపల్లి, ఆయన అనుచరులు వేదిక పైనుంచి కిందికి వచ్చి బైఠాయించారు. గొడవ సద్దుమణగకపోవడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకులు మహేశ్‌కుమార్‌గౌడ్ వేదికపై ఉన్నవారందరిని కిందికి దింపి సమావేశాన్ని కొనసాగించారు. సమావేశంలో బాబర్ సలీంపాషా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పాట రమేశ్, చేతి ధర్మయ్య, రేగులపాటి రమ్య, బోమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, ఉప్పరి రవి, దిండిగాల మధు, చెర్ల పద్మ, నాగి శేఖర్, వాసు, సురేందర్, ఉప్పుల అంజనీప్రసాద్, గందె మాధవి మహేశ్, అంజన్‌కుమార్, ఆకుల ప్రకాశ్, కెడం లింగమూర్తి, బోలిశెట్టి శివయ్య, బండ శంకర్, విజయరామారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.