కాకినాడ సిటీ : లంక భూములను స్థానిక దళితులకే కేటాయించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం లో గత నెల 4న జరిగిన దాడిలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గాయపడిన వారికి మూడు ఎకరాల భూమి, రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బినామీ సొసైటీలను రద్దు చేసి అసైండ్ చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, గ్రామంలో ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూములను దళితులకు ఇవ్వాలని, 2000 సంవత్పరంలో పట్టాలు ఇచ్చిన వారికి భూమి పొజిషన్ చూపించాలని, సాగుదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎస్.రాజారావు మాట్లాడుతూ లంక భూముల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బినామీ సొసైటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి బాధితులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమం లో ఏఐకేఎంఎస్ జిల్లా నేతలు ఆదినారాయణ, చిట్టిబాబు, ఐఎఫ్‌టీయు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
‘లంక భూములు దళితులకే ఇవ్వాలి’
Published Thu, Jul 10 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement