AIKMS
-
మోసం చేస్తున్న సీఎం
రాజాపేట : రైతుల సమస్యలను విస్మరించి మాటల గారడీతో ప్రజలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నారని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బీ కోటేశ్వర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఎంఎల్ (న్యూడెమోక్రసీ) సబ్‌డివిజన్ నాయకులు రేగు శ్రీశైలం అధ్యక్షతన ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. భువనగిరి ప్రాంతానికి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎంల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, డివిజన్ కార్యదర్శి ఆర్ జనార్దన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బెజాడి కుమార్, నాయకులు ఆర్ గీత, సీహెచ్ సత్యనారాయణ, రాజయ్య, టీ కొండయ్య, ప్రమీల, ఎన్ శ్రీను, బీ శ్రీను, నరేష్, సిద్ధులు, కనకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూములు పంపిణీ చేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీలింగు, బంజరు, పుంత, అటవీ భూములను పేదలకు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ భూ సంస్కరణల చట్టంలోని లొసుగులను సవరించాలని 1980లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఆచరణలో పెట్టలేదన్నారు. కోర్టు పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు శ్రద్ధ చూపడం లేదన్నారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, గోకవరం మండలం గంగంపాలెం గ్రామాల్లోని సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలు సాగు చేస్తున్న సీలింగ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి పి.ప్రదీప్, జిల్లా సహాయ కార్యదర్శి కె.దుర్గారావు, జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామన్న, జిల్లా కోశాధికారి ఎన్.వరదరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.సూరిబాబు, సీహెచ్ సూర్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పి.సోమన్న పాల్గొన్నారు. -
శ్రీకాంతాచారి ప్రాణత్యాగం వల్లే కేసీఆర్‌కు సీఎం సీటు
ఏఐకేఎంఎస్ రాష్ట్ర తొలి మహాసభల్లో జస్టిస్ చంద్రకుమార్ ఆర్మూర్: తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి ఆకలి తీరుతుందని ఆశించిన రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితికి సీఎం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర తొలి మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చంద్రకుమార్ మాట్లాడారు. దేశంలోని పది మంది బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 3 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొడితే పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతులకు రూ. 8 వేల కోట్ల మొండి బకాయిలుంటే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులను చిన్న చూపు చూడటం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరానికి రూ. కోటి ఆదాయం వచ్చినట్లు చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన దున్నితే నోట్ల కట్టలు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సుశాంత్ ఝా, కోశాధికారి బాల చంద్ర సండి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేజీ రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, సహాయ కార్యదర్శి వి. ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రభాకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
‘లంక భూములు దళితులకే ఇవ్వాలి’
కాకినాడ సిటీ : లంక భూములను స్థానిక దళితులకే కేటాయించాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం లో గత నెల 4న జరిగిన దాడిలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గాయపడిన వారికి మూడు ఎకరాల భూమి, రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బినామీ సొసైటీలను రద్దు చేసి అసైండ్ చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, గ్రామంలో ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూములను దళితులకు ఇవ్వాలని, 2000 సంవత్పరంలో పట్టాలు ఇచ్చిన వారికి భూమి పొజిషన్ చూపించాలని, సాగుదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎస్.రాజారావు మాట్లాడుతూ లంక భూముల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బినామీ సొసైటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించడంతో పాటు దాడి బాధితులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమం లో ఏఐకేఎంఎస్ జిల్లా నేతలు ఆదినారాయణ, చిట్టిబాబు, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. -
పవర్‌గ్రిడ్ వేరే చోట ఏర్పాటు చేయాలి
డిచ్పల్లి : పవర్‌గ్రిడ్ ప్లాంట్ ఏర్పాటు కోసం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో సర్వే నిర్వహించారని, జీవనాధారణమైన సాగు భూముల లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని రాంపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బాధిత రైతులు తహశీల్ కార్యాలయానికి తరలి వచ్చి ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాంపూర్ శివారులోని సర్వే నెంబర్లు 145, 127, 129 పట్టా భూముల్లో 765 కేవీ పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు కోసం భూసేకరణకు సర్వే నిర్వహించారని అన్నారు. ఈ భూముల్లో పలువురు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. జీవనాధారంగా ఉన్న సాగు భూములను ప్రభుత్వం లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందని రైతులు వాపోయారు. మండలంలోని ఇందల్వాయి శివారులో సర్వే నెంబరు 1107లో సుమారు 280 ఎకరాలు, సర్వే నెంబర్లు 334, 178ఎ, 599, 595, 246, 200ఎ, 173, 174, 175 లలో సుమారు 12 వందల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని తహశీల్దార్ రవీందర్‌కు వివరించారు. ఈ సర్వేనెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే జరిపించి అనువైన స్థలంలో పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. తమ సాగు భూములను తీసుకోవద్దని తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులు అంగీకారం లేకుండా భూములను తీసుకునే అధికారం తమకు లేదని, ఈ విషయంలో నిశ్చింతగా ఉండాలని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయబోమని రైతులకు తహశీల్దార్ హామీ ఇచ్చారు. ధర్నాలో ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి సాయాగౌడ్, మురళి, రైతులు గణేశ్, నవీన్, మల్లయ్య, శంకర్, ఎంకనోల్ల చిన్నవ్వ, రాజవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.