భూములు పంపిణీ చేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీలింగు, బంజరు, పుంత, అటవీ భూములను పేదలకు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ భూ సంస్కరణల చట్టంలోని లొసుగులను సవరించాలని 1980లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఆచరణలో పెట్టలేదన్నారు. కోర్టు పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు శ్రద్ధ చూపడం లేదన్నారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, గోకవరం మండలం గంగంపాలెం గ్రామాల్లోని సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలు సాగు చేస్తున్న సీలింగ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి పి.ప్రదీప్, జిల్లా సహాయ కార్యదర్శి కె.దుర్గారావు, జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామన్న, జిల్లా కోశాధికారి ఎన్.వరదరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.సూరిబాబు, సీహెచ్ సూర్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పి.సోమన్న పాల్గొన్నారు.