పవర్‌గ్రిడ్ వేరే చోట ఏర్పాటు చేయాలి
డిచ్‌పల్లి : పవర్‌గ్రిడ్ ప్లాంట్ ఏర్పాటు కోసం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో సర్వే నిర్వహించారని, జీవనాధారణమైన సాగు భూముల లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని రాంపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బాధిత రైతులు తహశీల్ కార్యాలయానికి తరలి వచ్చి ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాంపూర్ శివారులోని సర్వే నెంబర్లు 145, 127, 129 పట్టా భూముల్లో 765 కేవీ పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు కోసం భూసేకరణకు సర్వే నిర్వహించారని అన్నారు.
ఈ భూముల్లో పలువురు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. జీవనాధారంగా ఉన్న సాగు భూములను ప్రభుత్వం లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుందని రైతులు వాపోయారు. మండలంలోని ఇందల్వాయి శివారులో సర్వే నెంబరు 1107లో సుమారు 280 ఎకరాలు, సర్వే నెంబర్లు 334, 178ఎ, 599, 595, 246, 200ఎ, 173, 174, 175 లలో సుమారు 12 వందల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని తహశీల్దార్ రవీందర్‌కు వివరించారు.
ఈ సర్వేనెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే జరిపించి అనువైన స్థలంలో పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. తమ సాగు భూములను తీసుకోవద్దని తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులు అంగీకారం లేకుండా భూములను తీసుకునే అధికారం తమకు లేదని, ఈ విషయంలో నిశ్చింతగా ఉండాలని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయబోమని రైతులకు తహశీల్దార్ హామీ ఇచ్చారు. ధర్నాలో ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి సాయాగౌడ్, మురళి, రైతులు గణేశ్, నవీన్, మల్లయ్య, శంకర్, ఎంకనోల్ల చిన్నవ్వ, రాజవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.