శ్రీకాంతాచారి ప్రాణత్యాగం వల్లే కేసీఆర్‌కు సీఎం సీటు
ఏఐకేఎంఎస్ రాష్ట్ర తొలి మహాసభల్లో జస్టిస్ చంద్రకుమార్
ఆర్మూర్: తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి ఆకలి తీరుతుందని ఆశించిన రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితికి సీఎం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర తొలి మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చంద్రకుమార్ మాట్లాడారు. దేశంలోని పది మంది బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 3 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొడితే పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతులకు రూ. 8 వేల కోట్ల మొండి బకాయిలుంటే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులను చిన్న చూపు చూడటం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరానికి రూ. కోటి ఆదాయం వచ్చినట్లు చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన దున్నితే నోట్ల కట్టలు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సుశాంత్ ఝా, కోశాధికారి బాల చంద్ర సండి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేజీ రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, సహాయ కార్యదర్శి వి. ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రభాకర్, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.