Srikanta Chari
-
కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి
సత్తుపల్లి: కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఒకదానికి తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి శంకరమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి టీజేఏసీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో నిర్మితమైన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమ నేత కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సాగిన ఆందోళనలో నా కొడుకు శ్రీకాంతాచారి తన ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. శరీరాన్ని మంటలు దహిస్తున్నప్పుడు కూడా అమ్మా.. నాన్న.. అని అనలేదు. ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ అమరుడయ్యాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో అమరుడైన నా కొడుకు ఆత్మ శాంతించింది’’ అని, భావోద్వేగం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ‘‘శ్రీకాంతాచారి తొలి వర్ధంతి రోజున అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో ఒకదానికి శ్రీకాంతాచారి పేరు పెడతామని ప్రకటించారు’’ అని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, నాయకులు చిత్తలూరి ప్రసాద్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కూకలకుంట రవి, కూసంపూడి రవీంద్ర, జి.రామకృష్ణ, ఆయూబ్‌పాషా, అమర్లపూడి రాము, చీపు జగదీష్, కోటగిరి మురళీకృష్ణారావు, వి.సాగర్, టీఆర్ఎస్ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, కృష్ణయ్య, గాదె సత్యం, కొత్తూరు ప్రభాకర్‌రావు, నారాయణవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాంతాచారి ప్రాణత్యాగం వల్లే కేసీఆర్‌కు సీఎం సీటు
ఏఐకేఎంఎస్ రాష్ట్ర తొలి మహాసభల్లో జస్టిస్ చంద్రకుమార్ ఆర్మూర్: తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి ఆకలి తీరుతుందని ఆశించిన రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితికి సీఎం కేసీఆర్ తెచ్చారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర తొలి మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో చంద్రకుమార్ మాట్లాడారు. దేశంలోని పది మంది బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 3 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొడితే పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతులకు రూ. 8 వేల కోట్ల మొండి బకాయిలుంటే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులను చిన్న చూపు చూడటం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరానికి రూ. కోటి ఆదాయం వచ్చినట్లు చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన దున్నితే నోట్ల కట్టలు వస్తున్నాయా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సుశాంత్ ఝా, కోశాధికారి బాల చంద్ర సండి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేజీ రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, సహాయ కార్యదర్శి వి. ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రభాకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.