
కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి
సత్తుపల్లి: కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఒకదానికి తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి శంకరమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి టీజేఏసీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో నిర్మితమైన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమ నేత కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సాగిన ఆందోళనలో నా కొడుకు శ్రీకాంతాచారి తన ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. శరీరాన్ని మంటలు దహిస్తున్నప్పుడు కూడా అమ్మా.. నాన్న.. అని అనలేదు. ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ అమరుడయ్యాడు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో అమరుడైన నా కొడుకు ఆత్మ శాంతించింది’’ అని, భావోద్వేగం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ‘‘శ్రీకాంతాచారి తొలి వర్ధంతి రోజున అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో ఒకదానికి శ్రీకాంతాచారి పేరు పెడతామని ప్రకటించారు’’ అని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని కోరారు.
కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి, టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, నాయకులు చిత్తలూరి ప్రసాద్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కూకలకుంట రవి, కూసంపూడి రవీంద్ర, జి.రామకృష్ణ, ఆయూబ్‌పాషా, అమర్లపూడి రాము, చీపు జగదీష్, కోటగిరి మురళీకృష్ణారావు, వి.సాగర్, టీఆర్‌ఎస్ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, కృష్ణయ్య, గాదె సత్యం, కొత్తూరు ప్రభాకర్‌రావు, నారాయణవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.