తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి సుమారు 250 ఎకరాలతోపాటు మరో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడి విమానాశ్రయ భూములను పరిశీలించేందుకు బుధవారం వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృంద సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇదే సమయంలో పట్టణంలో మానవ రహిత విమాన తయారీ కేంద్రాన్ని రూ.రెండు వేల కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవల ప్రకటించారు. దీనివల్ల మూడువేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఇదే క్రమంలో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తదనంతర ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో భాగంగా మానవరహిత విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారా లేక విమానాశ్రయ నిర్మాణ పనుల్లో భాగంగా సర్వే పనులు జరుగుతున్నాయా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది.
మొత్తం 350 ఎకరాలు అవసరం
విమానాశ్రయం ఏర్పాటుకు 350 ఎకరాల భూమి అవసరం అవుతుందని సర్వే నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చిన రైట్స్ సంస్థ సీనియర్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ( ఎయిర్‌పోర్ట్స్) సంజీవ్ జాన్ తెలిపారు . ఆయనతోపాటు అసిస్టెంట్ మేనేజర్ ఎస్‌హెచ్ గోవర్, సర్వేయర్ రౌతు రామకృష్ణ విమానాశ్రయ భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలను బుధవారం సేకరించి వెళ్లారు. విమానాశ్రయం ఏర్పాటుకు 350 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 247 ఎకరాలు పోను, మిగిలిన 103 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న 247 ఎకరాల భూమిని విమానాశ్రయ పనులు చేపట్టే సంస్థకు దఖలు పర్చే విధంగా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అనంతరం మిగిలిన భూమిని రైతుల నుంచి సేకరిస్తారు.
ఎక్కడిదీ రైట్స్ సంస్థ
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 1974లో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ( రైట్స్) పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ప్రారంభంలో రైల్వే రవాణా రంగానికి కన్సల్టెన్సీ సేవలను ఈ సంస్థ అందించేది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కనస్ట్రక్షన్స్ వంటి పనులు ఈ సంస్థ చేపడుతుంటుంది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, హైవేలు, అర్బన్ ప్లానింగ్ వంటి పనులను ప్రపంచంలోని 30 దేశాల్లో ఈ సంస్థ చేపడుతోంది. తాజాగా డీజిల్ లోకో లీజింగ్ సర్వీస్‌లోకి ప్రవేశించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటుకు సర్వే జరుగుతోంది.
ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు
ఏలూరు అర్బన్ : ఆర్టీసీ బస్సులను ఏలూరు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న కండక్టర్లు, డ్రైవర్లపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆర్టీసీ అధికారులు బస్‌లను ప్రైవేటు కార్మికులతో బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టగా, ఆర్టీసీ ఉద్యోగులు నిరోధించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళా కండక్టర్లు, డ్రైవర్లతో కలిసి 38 మందిపై కేసు పెట్టారు.
విమానాలు ఎగరాలంటే..
Published Thu, May 7 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement