- టీటీడీ కొత్త ఆంక్షలు
- అన్యమత ప్రచార ఘటనతో శుక్రవారం నుంచి తీవ్రమైన తనిఖీలు
- ఇకపై పరమత పుస్తకాలు,కరపత్రాలతో వస్తే కేసులు
- కాలిబాటల్లోనూ పటిష్టంగా తనిఖీలు
సాక్షి, తిరుమల: తిరుమలకు ప్రవేశ మార్గమైన అలిపిరిలో టీటీడీ భద్రతా విభాగం ఆంక్షలు విధించింది. అన్యమత ప్రచార ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి తనిఖీ చర్యలు తీవ్రతరం చేసింది. భద్రతా పరమైన సోదాలు రెట్టింపు చేసి నిబంధనలు ఉల్లంఘించి పరమత పుస్తకాలు, కరపత్రాలతో ప్రవేశిస్తే కేసులు పెట్టాలని నిర్ణయించింది.
టీటీడీ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు..
వాహనాలకు అనుమతి లేదు
తిరుమలలో అన్యమత సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఘటనలో భద్రతా విభాగం వైఫల్యం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో అలాంటి విమర్శలకు తావులేకుండా టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా గట్టి చర్యలకు దిగింది. ఇకపై టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా పరమత పుస్తకాలు, కరపత్రాలతో తిరుమలకు వచ్చేవారిని అలిపిరి టోల్‌గేట్‌లోనే కట్టడి చేయాలని విజిలెన్స్ విభాగం అధికారులు నిర్ణయించించారు.
అలాంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం కేసులు కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ పరమతాలకు చెందిన చిహ్నాలు, పేర్లతో కూడిన వాహనాలు వస్తే అవి కనిపించకుండా స్టిక్కర్లు అతికించి తిరుమలకు పంపే విధానానికి స్వస్తిపలికారు. అలాంటి వాహనాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు పంపకూడదని నిర్ణయించారు. అలిపిరిలోని గరుడ విగ్రహం వెనుక టీటీడీ హద్దుల్లోని ప్రవేశద్వారం వద్ద వాహనాలను గుర్తించి వెనక్కు పంపే చర్యలు శుక్రవారం నుంచి తీసుకున్నామని టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి తెలిపారు.
అలిపిరిలో రెట్టింపైన భద్రతా తనిఖీలు
అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. గత సంఘటనల్లో వెలుగుచూసిన వైఫల్యాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అలిపిరి ఏవీఎస్‌వో కూర్మారావు అమలు చేశారు. ఇప్పటి వరకు కేవలం తిరుమలకు నిషేధిత పదార్థాలపైనే ఎక్కువ దృష్టిసారించారు.
తాజా ఉత్తర్వులతో భద్రతా పరమైన తనిఖీలతోపాటు ప్రత్యేకంగా పరమత పుస్తకాలు, కరపత్రాలు, గుర్తులు వంటి విషయాలపై మరింత అవగాహనతో ఉండాలని ఏవీఎస్‌వో కూర్మారావు తనిఖీల్లోని ఎస్‌పీఎఫ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. నిషేధిత గుర్తులతో వాహనాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఉత్తర్వులిచ్చారు. దీంతోపాటు తిరుమలకు ప్రవేశ మార్గాలైన అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతాపరమైన తనిఖీలతోపాటు, పరమత ప్రచార సంఘటనలకు అవకాశం లేకుండా తనిఖీలు చేశారు.