
అన్నీ అబద్ధాలే...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలేనని తేలిపోతోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలేనని తేలిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆయన పాట్లు పడ్డారనీ తేటతెల్లమవుతోంది. రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను మోసగించిన బాబు ,అధికారం చేపట్టాక కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘ఎన్టీఆర్ సుజల’ పథకం గ్రామీణుల దరి చేరలేక మరో మాఫీ హామీగా మారింది. గ్రామాల్లో టార్చిలైటు వేసిన వెతికినా ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమం జాడ కూడా కానరావడం లేదు. గాంధీ జయంతి రోజు నుంచి 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వానికే అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఎల్‌ఈడీ లైట్లు వెలిగేదెప్పుడు?
ఎల్‌ఈడీ బల్బుల కోసం గ్రామీణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు పంపిణీ చేసేది అధికారులు ప్రకటించకపోవటంతో గ్రామీణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట, వినుకొండ పట్టణాల్లో మాత్రమే పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ సుజలకు ఆటంకాలెన్నో...
ఆర్భాటంగా రూ.2లకే 20 లీటర్ల నీరందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో ఎన్నో ప్రతిబంధకాలను సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సుజల ద్వారా శుద్ధమైన తాగునీటిని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా ప్లాంట్లు ఏర్పాటుకు దాతలు రూ.2లక్షలు భరించాలని చెప్పటంతో
ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
శావల్యాపురం
తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు...అభివృద్ధి కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు నిదర్శనంగా ఎన్టీఆర్ సు జల, ఎల్‌ఈడీ లైట్ల పంపిణీ కార్యక్రమాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తామని మాటిచ్చి, ఆ తరువాత నగరాలు, పట్టణాలకు తొలి ప్రాధాన్యమని చేసిన ప్రకటన సర్వత్రా విమర్శలకు దారితీసింది.
శావల్యాపురం మండల పరిధిలో 15 పంచాయతీలు ఉండగా, సుమారు 30 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. అధిక గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2 వ తేదీ నుంచి జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించింది. రూ.2 లకే 20 లీటర్ల శుద్ధజలాన్ని ప్రజలకు అందించనున్నట్టు తెలిపింది. ఎన్టీఆర్ సుజల పథకం గ్రామాల్లో ప్రారంభిస్తే తాగునీటి ఇక్కట్లు తొలగుతాయని ప్రజలు ఆశపడ్డారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు కాలేదు.
లోవోల్టేజ్, హైవోల్టేజ్‌తోపాటు టప్పున రాలిపోయే లైట్ల ఫిలమెంట్‌లు జేబులకు చిల్లు చేస్తుంటే విద్యుత్ బిల్లులు మోత కూడా సామాన్యునికి భారంగా మారింది. ఇలాంటి సమస్యలను నివారించడంతో పాటు విద్యుత్ పొదుపులో భాగంగా ప్రభుత్వం ఎల్‌ఈడీ ైలైట్ల పంపిణీని చేపడతామని ప్రకటించింది.
గత నెల 25వ తేదీ నుంచి నియోజకవర్గ కేంద్రమైన వినుకొండ పట్టణంలో మాత్రమే రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి లైట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో గ్రామీణ విద్యుత్ వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
సాక్షాత్తూ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కారుమంచి గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరుకాగా, ఎల్‌ఈడీలైట్ల పంపిణీ ఎప్పుడు చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించారు. ఎన్టీఆర్ సుజల పథకం, ఎల్‌ఈడీ లైట్ల పంపిణీ కార్యక్రమం మండల స్థాయిలో ప్రారంభం కాకపోవటంతో గ్రామాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌ఈడీ బల్బుల కోసం గ్రామీణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో బల్బు రూ.10లకే ఇవ్వనున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందని, 5 ఏళ్లపాటు పనిచేస్తాయని చెప్పటంతో వీటి పట్ల మక్కువ కనబరుస్తున్నారు.
పలు గ్రామాల ప్రజలు, నాయకులు విద్యుత్ అధికారులను ఎల్‌ఈడీ లైట్ల గురించి అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు పంపిణీ చేసేది అధికారులు ప్రకటించకపోవటంతో గ్రామీణులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై చిన్నచూపు చూస్తోందని అంటున్నారు.