
అన్నీ తానై...
కోడూరు, న్యూస్‌లైన్: కోడూరు సంతమార్కెట్ సమీపంలో నివసిస్తున్న తిరుపతమ్మ తల్లిదండ్రులు కుంభా కృష్ణ, నాంచారమ్మలకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాంబశివరావు (22) పుట్టుక తోనే మూగ, చెవిటివాడు, చిన్నకుమారుడు వెంకటేశ్వరరావు (14) పుట్ట్టు గుడ్డి. కుమార్తె తిరుపతమ్మ (20) ఆరోగ్యంగా ఉండడంతో కుమార్తెలోనే కొడుకును చూసుకుని ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో పుట్టెడు కష్టం ఉన్నా పెదవి మాటునే బాధను దిగమింగుకొని కూలీనాలీ చేసుకుని సంపాదించిన దాంట్లో తలాకాస్తా తిని బతుకును భారంగా కొనసాగిస్తున్నారు.
వేటాడి చేపలు పట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుం బాన్ని తండ్రి పోషించేవాడు. మూడు సంవత్సరాల కిందట ప్రమాదవశాత్తు కాలువలోపడి తండ్రి మృతి చెందా డు. అప్పట్నుంచి అమ్మ నాంచారమ్మ చేపలు కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి మరణంతో కుంగిపోయిన తిరుపతమ్మపై విధి మరింత కన్నెర్ర చేసింది. తల్లి నాంచారమ్మను కూడా వారం రోజుల కిందట దూరం చేసింది. అనారోగ్యంతో బాధపడుతూ తల్లి మృతిచెందింది. దీంతో ముగ్గురు పిల్లలూ దిక్కులేని పక్షుల్లా మిగిలారు.
నాంచారమ్మ అంత్యక్రియలను గ్రామస్తులు తలో చేయి వేసి పూర్తి చేయించారు. అప్పటివరకూ ఇల్లు కదలని తిరుపతమ్మ వికలాంగ సోదరులకు పట్టెడన్నం పెట్టేందుకు తల్లి మరణించిన మరుసటి రోజు నుంచే కూలిపనుల కోసం కాలు బయటపెట్టక తప్పలేదు. మార్కెట్‌లో దొరికిన పని చేసుకుంటూ అన్నీ తానై ముందుకు సాగుతోంది. అన్నకు నెలకు వచ్చే వికలాంగ పింఛను రూ.500 ఈమె సంపాదనకు చన్నీళ్లకు వేడినీళ్లలా సాయపడుతోంది. కనీసం గూడు కల్పించాలని, ఎస్టీ కోటాలో గృహం కట్టించాలని, రెండో సోదరుడికి వికలాంగుల పింఛన్ ఇప్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా వీరి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది.
ఆదుకోరూ...
స్వచ్ఛంద సంస్థలు, దాతలు తమ పరిస్థితి అర్థం చేసుకుని అండగా నిలవాలని కోరుకుంటోంది ఈ బాలిక. వికలాంగులైన అన్న, తమ్ముడ్ని పోషించడం చాలా కష్టంగా ఉందని, తన చిట్టి చేతులు ఇంతటి భారాన్ని మోయలేకపోతున్నాయని .. తన కష్టాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు చేయూతనివ్వాలని అభ్యర్థి స్తోంది తిరుపతమ్మ.