
చేతిలో సకల ప్రపంచం
ప్రపంచం బహు శాస్త్ర విషయాల అధ్యయనంపై దృష్టి సారిస్తోందని, విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞావంతులుగా రాణించాల్సిన అవసరం ఉందని...
- రానున్నది సాంకేతిక విప్లవం
- దేశంలో మూడోవంతు ప్రజలకు నెట్ కనెక్షన్‌తో మొబైల్ ఫోన్లు
- విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞావంతులు కావాలి
- ఏయూ స్నాతకోత్సవంలో ‘ఇన్ఫోటెక్’ ఎమ్‌డీ మోహన్‌రెడ్డి
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: ప్రపంచం బహు శాస్త్ర విషయాల అధ్యయనంపై దృష్టి సారిస్తోందని, విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞావంతులుగా రాణించాల్సిన అవసరం ఉందని ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి అన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్‌లో సోమవారం జరిగిన ఆంధ్ర విశ్వకళా పరిషత్ 80, 81వ స్నాతకోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సాంకేతికత సహకారంతో మన ప్రపంచాన్ని మెరుగుపరచడం’ అనే అంశంపై ఆయన స్నాతకోత్సవ ప్రసంగం చేశారు.
సజ్జనత్వం, న్యాయపరివర్తన, గౌరవం, సద్భావం, పారదర్శకత పాటిస్తూ న్యాయబద్ధంగా జీవనం సాగించాలని విద్యార్థులకు మోహన్‌రెడ్డి సూచించారు. అభ్యసనమే గమ్యం కాకూడదని, అది ఒక ప్రయాణంగా సాగాలన్నారు. సాంకేతికంగా సుసంపన్నం కావడం ద్వారా ప్రపంచాన్ని మరింత మెరుగుపరచడం సాధ్యపడుతుందన్నారు. సాంకేతికత సహకారంతో 2015 నాటికి ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్న మొబైల్ ఫోన్లు దేశంలోని మూడో వంతు ప్రజలకు చేరువవుతాయన్నారు.
విద్య ప్రపంచాన్ని మార్చగల ఆయుధంగా పనిచేస్తుందని నెల్సన్ మండేలా చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తానన్నారు. ఉప కులపతి జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పరిశోధన రంగంలో ఏయూ ముందంజలో ఉందన్నారు. డీఎస్‌టీ నుంచి రూ.16 కోట్లు, నేవల్ రీసెర్చ్ బోర్డు నుంచి రూ.10 కోట్లు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ద్వారా రూ.70 లక్షలు, ఇంజనీరింగ్ కళాశాలకు టెక్విప్ నిధులుగా రూ.17.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఓఎన్‌జీసీ ద్వారా డెల్టా స్టడీస్ కేంద్రానికి రూ.కోటి, స్టీల్‌ప్లాంట్ సహకారంతో స్టీల్ చైర్ ఏర్పాటు కావడం జరుగుతోందన్నారు.
ఎన్‌ఎంఆర్ పరిశోధన కేంద్రాన్ని రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వర్సిటీకి రూ.20 కోట్ల మేర లోటు ఏర్పడడానికి కారణాలను, వర్శిటీ సాధించిన ప్రగతిని వివరించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాల్స్ సిహెచ్.వి.రామచంద్రమూర్తి, సిహెచ్.రత్నం, జి.జ్ఞానమణి, బి.గంగారాం, డి.ప్రభాకరరావు, ఎ.సుబ్రహ్మణ్యం, మాజీ వీసీలు పద్మశ్రీ కోనేరు రామకృష్ణారావు, కె.వి రమణ, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్‌లు, వర్సిటీ డీన్‌లు, అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు, ఆచార్యులు పెద్దసంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు పట్టభద్రులంతా తమ సీట్లలో ఆసీనులు కావాలని తెలియజేసినా పూర్తిస్థాయిలో హాలు నిండలేదు. అయితే ముఖ్య అతిథి నిర్ణీత సమయం కంటే ముందుగానే స్నాతకోత్సవ మందిరానికి చేరుకున్నారు.
పరిమితికి మించి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేయడంతో ఒకింత ఇబ్బంది ఎదురయింది.
పట్టాలు తీసుకున్నవారు తమ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటూ ఫొటోలు దిగారు.
ముఖ్యఅతిథి ప్రసంగించే సమయానికి మందిరంలో అంతంతమాత్రంగానే పట్టభద్రులు ఉన్నారు. దీంతో స్నాతకోత్సవ మందిరం చిన్నబోయింది.
చోడవరానికి చెందిన అంధ విద్యార్థి సురేంద్రవర్మ బీఏలో బంగారు పతకాన్ని, మరో వికలాంగుడు డాక్టరేట్‌ను అందుకున్నారు.
వైద్యులకు నైతిక విలువలు బోధించాలి
‘ఎయిడ్స్ చికిత్సా విధానంలో ఎదురవుతున్న నైతిక సవాళ్లు’ అనే అంశంపై ఏయూ తత్వశాస్త్ర విభాగం నుంచి పరిశోధన జరిపాను. ఈ వ్యాధిగ్రస్తులూ మనవంటి మనుషులేనన్న భావన కలిగించాలి. మానవతా విలువలకు ప్రాధాన్యమిస్తూ, ఆర్ద్రతతో రోగులకు సేవలు అందించాలి. రోగికి వైద్యం చేసేముందు అతని అనుమతి సైతం తీసుకోవాలి, చికిత్స విధానాలు తెలపాలి. వీరికి సైతం ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. కిడ్నీ, గుండె సంబంధ రోగులతో సమానంగా చూడాలి. వివక్షకు తావు లేకుండా సాంత్వన చేకూర్చాలి. మన వైద్యశాస్త్రంలో నైతిక విలువల బోధన అనే అంశం లేదు. దీనిని పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది.
- పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు
మహిళలకు మరింత సాధికారత
మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళా ప్రతినిధులపై నా అధ్యయనం సాగింది. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో సిద్ధించాలంటే వారికి రాజకీయంగా మరింత అవకాశం కల్పించాలి. రొటేషన్ విధానం కారణంగా కొంతమంది రెండోసారి పోటీ చేయలేకపోతున్నారు. వారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం గుర్తించాను. కొత్తగా ఎన్నికైన వారికి ప్రత్యేకంగా చట్టాల తీరు, వినియోగించే విధానాలను వివరించాలి. కొంతమంది మహిళా ప్రతినిధులు తమకు పదవి ఉన్నప్పటికీ కేవలం నామమాత్రంగా ఉంటున్నారు. వారి కుటుంబంలోని పురుషుల ఆధిపత్యాన్ని వీరు అంగీకరిస్తున్నట్టు గుర్తించాను.
- రాజాన రమణి, మాజీ మేయర్