వెల్లడించిన ఆర్పీవో అశ్విని
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు అక్కడినుంచే సేవలు
త్వరలోనే ప్రక్రియ పూర్తి
విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు విశాఖకు అనుసంధానం
అత్యధిక పాస్‌పోర్టులు జారీ చేసిన హైదరాబాద్ కేంద్రం
సీమ సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తా: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇకపై పాస్‌పోర్ట్ సేవలన్నీ విశాఖపట్నం కేంద్రంగా అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాలకు సేవలు అందిస్తోంది. ఇకపై ఏపీలోని ఆ 8 జిల్లాల సేవలు కూడా విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదలాయిస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీవో) అశ్విని సత్తారు వెల్లడించారు.
గురువారం ఆమె డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు సేవలు అందుతున్నాయని, ఇకనుంచి మిగిలిన జిల్లాల సేవలను కూడా విశాఖకు బదలాయిస్తున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
పాస్‌పోర్ట్ సేవలను బదలాయించడంతో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతిలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు కూడా విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికే అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 2014 సంవత్సరంలో 7.17 లక్షల పాస్‌పోర్ట్ దరఖాస్తులను స్వీకరించి, 6.95 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసి హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పాస్‌పోర్ట్‌ల జారీలో 13 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.
చేతిరాత పాస్‌పోర్ట్‌లు చెల్లవు
గతంలో చేతిరాతతో పాస్‌పోర్ట్‌లు తీసుకున్న వారు ఈ ఏడాది నవంబర్ 24వ తేదీలోగా తిరిగి దరఖాస్తు చేసుకుని, మిషన్ రీడబుల్ పాస్‌పోర్ట్ (ఎంఆర్‌పీ)లు తీసుకోవాలని ఆమె చెప్పారు. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ నిర్ణయం మేరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ తర్వాత చేతిరాత ఉన్న పాస్‌పోర్ట్‌లు చెల్లవన్నారు. ఇకపై వీసా కోసం వెళ్లేవారు ఆరు మాసాల పాస్‌పోర్ట్ కాలపరిమితి కలిగి ఉండాలని, లేదంటే ముందుగానే దరఖాస్తు చేసుకుని కొత్త పాస్‌పోర్ట్ పొందాలన్నారు.
పాస్‌పోర్ట్ కాలపరిమితి ఏడాది ఉన్నా కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. మైనర్‌లు మేజర్‌లుగా మారుతుంటే వారుకూడా కొత్త పాస్‌పోర్ట్‌లు తీసుకోవాలన్నారు. వీసా పేజీల పెంపు కోసం అభ్యర్థులు రీయిష్యూ కింద దరఖాస్తు చేసుకుని, 60 పేజీల జంబో బుక్‌లెట్ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చునని అన్నారు. వచ్చే ఏడాది ఇ-పాస్‌పోర్ట్‌లు (చిప్‌తో కూడిన) ఇచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ ఏడాది హజ్‌యాత్రలకు వెళ్లే అభ్యర్థుల పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అశ్విని పేర్కొన్నారు.
ఇక హజ్ యాత్రీకులకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆంధ్రలోని కృష్ణా జిల్లాల్లో పోలీసు విచారణ త్వరగా పూర్తవుతోందని, అది పూర్తయిన ఐదు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తున్నామని అశ్విని చెప్పారు. పాస్‌పోర్టు ఏజెంట్లు భారీ వసూళ్లపై విలేకరులు ప్రశ్నించగా.. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తు బాధ్యతలను త్వరలోనే పోస్టాఫీసులకు అప్పజెప్పబోతున్నామని వెల్లడించారు.
సీమ సమస్యపై ప్రభుత్వ ప్రతిపాదనలు లేవు
పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నానికి తరలిస్తే రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని, ప్రయాణం భారంగా ఉంటుందని విలేకరులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీనికి అశ్విని స్పందిస్తూ.. ఇలాంటి ఇబ్బందులు తమకు కూడా తెలుసునని, కేంద్ర నిర్ణయాన్ని తాము కాదనలేమన్నారు. అయితే ఇలాంటి సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని అన్నారు. ఒకవేళ ఏమైనా ప్రతిపాదనలు వస్తే కేంద్రానికి పంపుతామన్నారు.
ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించదా?
పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నానికి తరలిస్తే రాయలసీమ జిల్లాల వాసుల పరిస్థితి ఏమిటి? చిన్నపనైనా 700 కిలోమీటర్లు వెళ్లగలరా? నా నియోజకవర్గం నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. వాళ్లలో చాలామంది నిరక్షరాస్యులు. వారు విశాఖపట్నం వెళ్లగలరా? అసలు దరఖాస్తుదారుల ఇబ్బందులు ఈ ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టమైంది. అందరికీ అందుబాటులో పాస్‌పోర్ట్ సేవలు ఉండేలా చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, విదేశాంగ కార్యదర్శికి లేఖ రాస్తా. అవసరమైతే పార్లమెంటులో దీనిపై ప్రశ్నిస్తా.
-పి.మిథున్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, రాజంపేట
పాస్‌పోర్ట్ సేవలన్నీ ఇక విశాఖలో..
Published Fri, Jan 30 2015 12:30 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement