పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం | all ready to pulse polio program | Sakshi
Sakshi News home page

పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం

Published Sun, Jan 19 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

all ready to pulse polio program

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,53,656 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి వారందరికీ చుక్కలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 450 వేల పోలియో చుక్కలు అందుబాటులో ఉంచా రు. ఈ కార్యక్రమ నిర్వహణకు 9,368 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సీహెచ్‌ఎన్‌సీ, ఎస్‌పీహెచ్‌ఓ, ప్రోగ్రామ్ అధికారులు పర్యవేక్షిస్తారు.

 ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రధాన కూడళ్లలో బూత్‌లను ఏర్పాటు చేసి చుక్కల మందు వేయనున్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మ తెలిపారు. డయేరియా, వాంతులు ఉన్న వారికి చుక్కలు వేయరాదన్నారు. మురికి వాడల్లో నివసిస్తున్న వారు, వలస సంచార జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యేకంగా 21వ తేదీన జిల్లాలో మొత్తం 86 మొబైల్ యూనిట్ల ద్వారా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కలు వేస్తామన్నా.

 క్లస్టర్ల వారీగా చిన్నారుల గుర్తింపు..
 జిల్లాలో క్లస్టర్ల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్టు ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పద్మ తెలిపారు. నర్సాపూర్ క్లస్టర్‌లో 22,689 మంది, రామాయంపేటలో 41,340, జోగిపేటలో 25,019, నారాయణ్‌ఖేడ్‌లో 32,287, కోహీర్‌లో 40,648, సదాశివపేటలో 39,338, పటాన్‌చెరులో 45,744, సిద్దిపేటలో 36,249, దుబ్బాకలో 8,735, గజ్వేల్‌లో 37,960 మంది పిల్లలను గుర్తించినట్టు చెప్పారు.

 పోలియో రహిత సమాజానికి కృషి చేయాలి
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు జేసీ మూర్తి తెలిపారు. ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జేసీ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ పూర్ణచంద్ర, మున్సిపల్ కమిషనర్‌లు, నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

 పంచాయతీ కార్యదర్శులు పాల్గొనాలి..
 పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విధిగా పాల్గొనాలని డీపీఓ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి 25 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశానికి హాజరు కాని పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement