అన్నీ అడ్డంకులే.. | All the obstacles .. | Sakshi
Sakshi News home page

అన్నీ అడ్డంకులే..

Published Mon, Nov 25 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

All the obstacles ..

=‘ఇందిర జలప్రభ’కు బాలారిష్టాలు
 =మోటార్లకు ధర నిర్ణయంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారం
 =ఎస్సీ,ఎస్టీల భూములకు అందని సాగునీరు

 
సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ,ఎస్టీ భూములను సాగులోకి తెచ్చేందుకు చేపట్టిన ఇందిర జలప్రభ పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది.  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ముహూర్తాన దీనికి శ్రీకారం చుట్టారో గానీ అన్నీ అడ్డంకులే. ప్రభుత్వ అలక్ష్యానికి అధికారులు చిన్నచూపు తోడయింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ పథకం పరిస్థితి తయారైంది. గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో బోర్లు తవ్వకాలకు రిగ్ యజమానులు కొంతకాలం ముందుకు రావడంలేదు.

పథకం ప్రవేశపెట్టిన రెండేళ్ల అనంతరం కొందరు ఆసక్తి చూపడంతో జిల్లా వ్యాప్తంగా 155 బోర్లు వేశారు. కానీ విద్యుత్ సౌకర్యం, పంపు సెట్లు అమర్చడంలో అధికారులు విఫలమయ్యారు. ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా సరైన ధర ఇవ్వలేదంటూ పంపు సెట్లు ఏర్పాటుకు కంపెనీలు ముఖం చాటేశాయి. దీంతో ఏళ్ల క్రితం డ్రిల్లింగ్ చేసిన బోర్లు నిరుపయోగమయ్యాయి. ధర విషయంలో కాస్తా వెసులుబాటు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మరోసారి అధికారులు టెండర్లు పిలిచారు.

కానీ ప్రభుత్వ స్థాయిలో ఏమైందో.. గడువు ముగియకుండానే వాటిని మధ్యలోనే రద్దు చేశారు. వివిధ శాఖల అధికారులు సభ్యులగా ఉన్న జిల్లా పర్చేజింగ్ కమిటీ నిర్ణయించిన ధరకు పంపు సెట్లు కొనుగోలు చేసి అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడా కమిటీ పంపుసెట్ల ధర నిర్ణయంలో తాత్సారం చేస్తోంది. రేటు నిర్ణయించకుండా వాటిని కొనుగోలు చేసే అధికారం సంబంధిత అధికారులకు లేదు.  

దీంతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న డ్వామా అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం 28 బోర్లు విద్యుత్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నా పంపుసెట్లు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీల భూములకు సాగునీరందించలేని దుస్థితి. పంపుసెట్లు అమరిస్తే మరో127 బోర్లుకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా  జిల్లా పర్చేజింగ్ కమిటీ తాత్సారంతో ఇప్పుడు ఇందిర జల ప్రభ అక్కరకు రాకుండాపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement