![Alla Nani Advice People To Maintain Social Distance To Be Safe From Corona - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/27/Meka.jpg.webp?itok=T1DYsxgc)
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, మేకతోటి సుచరిత
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే చాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు గురువారం ఆయన గుంటూరు కలెక్టరేట్‌లో మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, మేకతోటి సుచరితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా అనుమానితుల నుంచి 332 శాంపిల్స్ సేకరించగా, అందులో 289 శాంపిల్స్ నెగిటివ్, 10 పాజిటివ్‌గా వచ్చాయని వివరించారు. మరో 33 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. మంత్రులు ఇంకా ఏం చెప్పారంటే..
►రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు చోట్ల ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నాం. కొత్తగా గుంటూరు, కడప, విశాఖ పట్నంలో మరో మూడు ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
►గుంటూరులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రికి తరలించాం. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించాం.
►నిత్యావసర వస్తువులు నల్ల బజారుకు తరలిస్తే కేసులు నమోదు చేస్తాం.
►పాలు, కోడి గుడ్లు, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఆటంకం లేకుండా చూస్తున్నాం.
►మిర్చి పంటను రైతులు కోల్డ్ స్టోరేజీలకు తరిలించి, నిల్వ చేసుకొనేందుకు వీలుగా రవాణా అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలి.
►ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐ.శ్యామూల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, గుంటూరు ఐజీ ప్రభాకరరావు, అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment