బయట పడని ‘డాలర్’ బండారం | Allergies Away 'star' constitution | Sakshi
Sakshi News home page

బయట పడని ‘డాలర్’ బండారం

Published Sun, Feb 2 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

Allergies Away 'star' constitution

సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో గత ఏడాది సరస్వతీయాగం సందర్భంగా మాయమైన డాలర్ల(లాకెట్ల) బండారం ఇంకా బయటపడలేదు. ఈ అవినీతి బాగోతాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కప్పిపెట్టారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఓ దాత ఇచ్చిన డాలర్లు మాయం కావడంతో ఈ ఏడాది సరస్వతీ యాగానికి సహకరించేందుకు దాతలు ఎవరూ ముందుకు రాలేదు.
 
పది వేల డాలర్లు మాయం
 
ఈ నెల 4న శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సరస్వతీయాగం జరగనుంది.  గత ఏడాది ఫిబ్రవరి 11న కూడా ఈ యాగం జరిగింది. అప్పట్లో  యాగం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే విద్యార్థులకు దుర్గగుడిలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రొత్సాహంతో తెనాలికి చెందిన శివకుమార్ అనే భక్తుడు సుమారు రూ.7లక్షల ఖర్చుతో 10వేల డాలర్లు(ల్యాకెట్లు) తయారు చేయించి దేవస్థానానికి  ఇచ్చారు.

 రాగితో చేసిన ల్యాకెట్‌కు  వెండి, బంగారు పూత పూయించారు. అయితే దేవస్థానం అధికారులు, సిబ్బంది కమ్ముైక్కై ఆ డాలర్లును మాయం చేసినట్టు విమర్శలు వచ్చాయి. యాగం రోజున కేవలం రెండు రూపాయలకు లభించే రాగి ల్యాకెట్లును విద్యార్థులకు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. డాలర్లు విద్యార్థులకు ఇవ్వలేదని  తెలుసుకున్న శివకుమార్ నివ్వెర పోయి ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఊరుకున్నారు.

ఈ డాలర్లును దేవస్థానం అధికారులే గప్‌చుప్‌గా మాయం చేసేశారని తరువాత ప్రచారం జరిగింది. ఇవి ఇప్పటికీ దేవస్థానంలోని కొంతమంది ఉద్యోగుల వద్ద ఉన్నట్లు సమాచారం. అప్పటి ఈవో ఆ ఘటనపై ఏఈవో స్థాయి అధికారిని విచారించాలని ఆదేశించారు. ఆ ఏఈవో కేసును తూతూమంత్రంగా పూర్తి చేసినట్టు సమాచారం.దీంతో ఆలయానికి ఇచ్చిన వస్తువులను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని గుర్తించి ఈ ఏడాది దాతలెవరూ ముందుకు రాలేదు.   
 
నాకేమీ తెలియదు : ఇన్‌చార్జి ఈవో త్రినాథ్‌రావు
 
సరస్వతీయాగం వివరాల గురించి చెప్పేందుకు శుక్రవారం ఇన్‌చార్జి ఈవో త్రినాథ్‌రావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయగా, మాయమైన డాలర్లపై విలేకరులు ప్రశ్నించారు. ఆ కేసు వివరాలు తనకు తెలియదంటూ ఆయన మాట దాటవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement