
కొడుకుని అమ్మేసి కథ అల్లింది..
తాగుడుకు బానిసై నిత్యం అనుమానంతో వేధిస్తున్న భర్తను వదిలించుకుని వెళ్లిపోవడానికి అడ్డుగా ఉన్న కొడుకుని అమ్ముకు....
రూ. 30 వేలకు ముందే బేరం కుదుర్చుకున్న తల్లి
బంధువుతో కలిసి పథకం
12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
మైలవరం : తాగుడుకు బానిసై నిత్యం అనుమానంతో వేధిస్తున్న భర్తను వదిలించుకుని వెళ్లిపోవడానికి అడ్డుగా ఉన్న కొడుకుని అమ్ముకుని, చివరకు పోలీసుల వలలో చిక్కుకున్న మహిళ ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిని బాణావతు సంధ్య అనుమానంతో వేధిస్తున్న భర్త శివను వదిలించుకోడానికి జి.కొండూరులో నివసిస్తున్న సమీప బంధువు బుజ్జి అనే మహిళతో కలిసి వారం కిందట పథకం వేసింది. ఆ మేరకు ముచ్చర్ల శ్రీను, సరిత దంపతులకు చిన్నారిని రూ. 30 వేలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకుంది. సదరు సొమ్మును బుజ్జి ముందే తీసుకుని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత పథకం ప్రకారం మంగళవారం మూడు నెలల తన కొడుకును మైలవరం ఆస్పత్రిలో చూపించడానికని చెప్పి సంధ్య తీసుకువచ్చింది. అప్పటికే బస్టాండ్ వద్దకు బుజ్జితో పాటు సరిత, ముచ్చర్ల శ్రీను దంపతులు, దేవి అనే మహిళ చేరుకున్నారు. వారికి బిడ్డను అప్పగించిన సంధ్య తాను టాయిలెట్‌కు వెళుతూ పిల్లవాడిని పట్టుకోమని తన కులం మహిళకు ఇస్తే పరారయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తీగలాగితే డొంక కదిలింది...
తీగలాగితే డొంక కదిలినట్లు తన బిడ్డను అపహరించితే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన మహిళ స్వగ్రామం రుద్రవరం వెళ్లి బంధువులతో తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులు మరి కొంచెం లోతుగా విచారించగా అసలు విషయం బయట పడింది. భర్తను వదిలించుకుని కొడుకుని అమ్ముకుని వస్తే సుఖపడవచ్చని జి,కొండూరులో ఉండే బంధువు బుజ్జి ఇచ్చిన సూచనను సంధ్య పాటించిందని తేలింది. విచారణలో వెల్లడైన ప్రకారం కొండపల్లిలోని సరిత,శ్రీనుల వద్ద బిడ్డను రికవరీ చేసుకున్నామని, నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బిడ్డను విజయవాడలోని ఉమన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్‌కు అప్పగించామన్నారు. కేసును 12 గంటల్లోనే కేసు ఛేదించినట్లు డీఎస్పీ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు.