దొంగ బాబా శివ అరెస్ట్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా శివను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను పట్టుకున్నారు. చోరీ అనంతరం పరారైన శివ బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రముఖ రియల్‌ఎస్టేట్ వ్యాపారి, 'లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్‌చల్ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు.