- టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల్లో ఆగ్రహం
- చంద్రబాబు కోటరీకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపాటు
‘పెద్దల’ సభలో ఎప్పుడూ అన్యాయమే!
Published Wed, Jan 29 2014 2:18 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయూ సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ చంద్రబాబు తన సామాజిక వర్గానికి, అందులోనూ కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. ‘తాజా ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పేరు దాదాపు ఖరారైనట్టుగా పార్టీలో ప్రచారం జరిగింది. చివరికొచ్చేసరికి చంద్రబాబు ఆయనకు మొండిచెయ్యి చూపారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల నేతలు పలువురు.. రాజ్యసభ ఎన్నికలకు తమ పేర్లను పరిశీలించాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ అధినేత కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు..’ అని టీడీపీ కార్యదర్శి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంచుమర్తి అనూరాధ, కాలువ శ్రీనివాసులు, ఎం.అరవిందకుమార్‌గౌడ్, బీద రవిచంద్రయాదవ్ తదితరులు టికెట్‌ను ఆశించారు.
అయితే వీరి పేర్లను చంద్రబాబు కనీసం పరిశీలించలేదనే విమర్శలున్నారుు. జనాభాలో సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీలకు ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించానన్న చంద్రబాబు.. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం వహించే వారిని ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. 2012లో ఈ సామాజికవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు తమకు రాజ్యసభ సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే పార్టీలోకి తిరిగొచ్చిన దేవేందర్‌గౌడ్‌కే అవకాశం కల్పించారు. ఆ తరువాత యనమల వద్దన్నా ఆయనను శాసనమండలికి పంపారు. గత ఏడాది మండలి ఎన్నికలప్పుడు దాడి వీరభద్రరావు ప్రతిపక్ష నేతగా ఉండి మరోసారి అవకాశం కల్పించాల్సిందిగా కోరితే పట్టించుకోలేదు. దీంతో ఆయన ఏకంగా పార్టీనే వీడిపోయారు. ఇక ఎస్టీల పేర్లను ఈ ఎన్నికల్లో అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్సీల నుంచి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రులు పుష్పరాజ్, సుద్దాల దేవయ్య, ప్రతిభాభారతి టికెట్టు ఆశించారు. పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గత ఎన్నికల్లో దూరమైన కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ఎత్తుగడతో ఈసారి రామలక్ష్మికి అవకాశమిచ్చారని, ముందు ఆమె పేరు పరిశీలనలోనే లేదని నేతలు చెబుతున్నారు. తాను సూచించిన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణకు టికెట్ ఇవ్వకపోవడంపై ఎంపీ సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గరికపాటికి దక్కకుండా చేసిన ప్రయత్నం విఫలమవడం, నారాయణకు ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement