ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి దాదాపు 700 చిత్రాల్లో నటించినా తనకు నచ్చిన పాత్ర ఇంతవరకూ చేయలేదంటున్నారు. సినిమాల్లో నటించడం నేర్చుకున్నా కానీ, రాజకీయూల్లో నటించడం నేర్చుకోలేదని చెబుతున్నారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక పరిధిలోని బిళ్లూరులో నూతనంగా నిర్మించిన శ్రీ స్తంభ లక్ష్మీనరసింహ ఆలయం, శివపార్వతీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి సోమవారం రాత్రి ఆయన విచ్చేశారు. ఆయన 'సాక్షి'తో పలు విషయాలు ముచ్చటించారు.
సాక్షి : ఎవరిని ఆదర్శంగా తీసుకొని సినిమా రంగంలోకి వచ్చారు?
భరణి : నేనెవరినీ ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి రాలేదు. అయితే నా చిన్ననాటి నుంచి చదువుకొనే రోజుల్లో నాటకాల మీద చాలా ఆసక్తి కనబరుస్తూ వివిధ రకాల నాటకాల్లో పాత్రలను చేశాను. దీంతో కొంత మంది సినిమా వాళ్లు కొన్ని స్క్రిప్టులను రాయమన్నారు. 1970లో ‘అగ్గిపుల్ల - ఆత్మహత్య’ అనే కథకు స్క్రిప్టు తయారు చేశాను. రాను రాను సినిమాల్లో నటించే అవకాశం లభించింది.
సాక్షి : మీ సినీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది?
భరణి : 1984లో సినిమాల్లో నటించడం మొదలు పెట్టాను. అంతకు ముందే సినిమాల్లోకి వచ్చుంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌముని పక్కన నటించే అవకాశం ఉండేది. నేటికీ తన పక్కన నటించలేదనే కొరత మిగిలిపోయింది. అక్కినేనితో ఆరు సినిమాలు చేశాను.
సాక్షి : మీరు దర్శకత్వం వహించి చేసిన ఒకే ఒక్క చిత్రం మిథునం మీకు చాలా మంచి పేరు తెచ్చింది..
భరణి : మనిషి అనుకుంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాలనే ఆ సినిమాను కసితో చేశాను. ఆ సినిమాలో హీరోగా చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత ఎన్నో రకాల పనులు చేయించాను. మనిషి చేయలేనిదేదీ లేదని నిరూపించాను. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణంలో భార్యాభర్తల మధ్య హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించగలిగాము. సినిమా బాగుండటం వల్లే ఆ సినిమా టాలీవుడ్ సినిమాల్లో ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేశారు.
సాక్షి : మళ్లీ సినిమా తీయాలనుకుంటున్నారా?
భరణి : కన్నడంలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ‘బేడారా కన్నప్ప’ సినిమాను తెలుగులో భక్త కన్నప్పగా చేయాలనుకుంటున్నా. కథ తయారు చేసుకున్నా. సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నా.
సాక్షి : ఆ సినిమాలో మీరేదైనా పాత్ర పోషిస్తున్నారా? ఒకవేళ చేస్తే ఎలాంటి క్యారెక్టర్‌లో చేయాలనుకుంటున్నారు?
భరణి :నేను ఎలాంటి పాత్ర చేయదలుచుకోలేదు. ఒకవేళ చేస్తే రావుగోపాలరావు క్యారెక్టరు చేస్తాను.
సాక్షి : ఇంత వరకు మీరు నటించిన దాదాపు 700 చిత్రాల్లో మీకు నచ్చిన పాత్ర..
భరణి : ప్రేక్షకులకు నచ్చిన చిత్రాలు చేశానేమో కానీ, నాకు నచ్చిన పాత్ర ఇంతవరకూ చేయలేదు.
సాక్షి : మీరు చేయూలనుకుంటున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా?
భరణి : నేను ఇంతవరకూ కొన్ని వందల పాత్రల్లో నటించినా, ఒక్కో పాత్రలో ఒక ప్రత్యేకతను ప్రేక్షకులకు చూపాలని కోరుకున్నాను. నాకు శకుని పాత్ర చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే భారతంలో శకుని కౌరవులకు దగ్గరగా ఉంటూ పాండవులకు శత్రువుగా కనిపించాడు. అరుుతే కౌరవులకు హాని కలిగించాలనే దుర్భుద్దితో చివరకు పాండవులకే ఉపకారం చేస్తాడు. నాకు దుష్టపాత్రలు చేయాలంటే మహా ఇష్టం.
సాక్షి : సినీనటులు చాలా మంది రాజకీయూల్లో చేరాలని ఆసక్తి కనబరుస్తున్నారు. మీకేమైనా అలాంటి ఆలోచన వచ్చిందా?
భరణి : (నవ్వుతూ) అయ్యో నేనింతవరకు సినిమాల్లో నటించడం నేర్చుకున్నాను కానీ రాజకీయాల్లో నటించడం నేర్చుకోలేదు. నాకా ఉద్దేశం లేదు.
సాక్షి : ప్రస్తుత సమాజంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి.. దీనిపై మీరేమంటారు..
భరణి : ఈ విషయంపై నేను చెప్పేది ఒక్కటే. ప్రజలకు భయం లేదా భక్తి.. ఏదో ఒకటి ఉండాలి. రెండూ లేనప్పుడు ఇలా దుర్మార్గాలూ, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతూనే ఉంటాయి.
సాక్షి : సినిమా రంగంలో ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు..
భరణి : (తల పెకైత్తి ఆకాశాన్ని చూస్తూ రెండు చేతులూ జోడించి) మనదేముందండి.. బ్రహ్మ రాతకు తిరుగుండదు. టైం వస్తే అందరూ పోవాల్సిందే. బతికున్నన్నాళ్లు మనదే అనుకుని బతికేయాలి.
సాక్షి : మీరు శివభక్తులా లేక విష్ణు భక్తులా?
భరణి :నేను శివభక్తున్నే కానీ విష్ణువుకు దూరమేమీ కాదు.
సాక్షి : ప్రేక్షకులకు మీరేమైనా చెప్తారా?
భరణి : (మళ్లీ నవ్వుతూ) ప్రేక్షకులు చాలా తెలివైనవారండి. సినిమా బాగుంటే చూసి మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. సినిమా బాగోలేకపోతే.. ఏమేం అనాలో అన్నీ అనేస్తారు. వారికి చెప్పాల్సిందేమీ లేదు.
'రాజకీయ నటన రాదు'
Published Wed, Feb 4 2015 4:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement