
చంద్రబాబు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటు
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
గుంటూరు: స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఓటుకు నోటు విషయంలో డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబే తనతో ఫోనులో మాట్లాడారని కోర్టుకు స్టీఫెన్‌సన్ వాగ్మూలం ఇచ్చిన త రువాత కూడా ఆయన రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 31వ తేదీ నుంచి రేవంత్‌రెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. స్టీఫెన్‌సన్‌తో జరిగిన ఫోను సంభాషణల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్నారు.
కేసులో నిందితుడైన ముత్తయ్యను విజయవాడలో పోలీసుల సంరక్షణలో ఉంచటం, సండ్రను విశాఖపట్నంలో ఆస్పత్రిలో చేర్పించి నాటకాలు ఆడటం రాజ్యాంగ విలువలను చంద్రబాబు అపహాస్యం చేయటమేన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ విషయమై ఎందుకు నోరు మెదపటంలేదని ప్రశ్నించారు. తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు, వాటి వైఖరి తనని కలిచి వేస్తున్నాయని అంటున్న కేంద్ర మంత్రి వెంక య్యనాయుడు, జరిగిన సంఘటన ఒక్కటేనని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను సైతం వాడుకుని బయట పడేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎస్ కృష్ణారావు, డీజీపి రాముడు సైతం లోపాయికారంగా వ్యవహరించటం సరికాదన్నారు.