
బాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే వృద్ధులకు కష్టాలు: అంబటి
పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నందువల్లే వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైఎస్సార్‌సీపీ నేత అంబటి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పింఛన్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నందువల్లే వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కనమనపల్లెలో ఓ వృద్ధుడు ఆకలికి తాళలేక మరణించాడని ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత 4 నెలలుగా ఆ వృద్ధునికి పింఛన్ నిలిపివేశారని, వారం రోజులుగా తినడానికి ఏమీ లేక అతను ఆకలితో మరణించాడని, ఇది చాలా దారుణమైన ఘటనని అన్నారు. ఆ వృద్ధునికి ఏడెనిమిదేళ్లుగా పింఛను వస్తోందన్నారు. అయితే, వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంతో కొద్ది నెలల క్రితం పింఛన్ నిలిపి వేశారని తెలిపారు.బయోమెట్రిక్ విధానం వల్ల 70, 80 ఏళ్ల వృద్ధుల చేతి వేళ్లు అరిగిపోయి పింఛనుకు అర్హత పొందలేక పోతున్నారని తెలిపారు.