బంధాన్ని వీడలేక.. బలవన్మరణం
♦ వివాహితుల మధ్య వివాహేతర సంబంధం
♦ ఇద్దరూ పాతాళగంగలో దూకి ఆత్మహత్య
♦ మృతులు ప్రకాశం జిల్లా పాపినేనిపల్లె వాసులు
శ్రీశైలం : వారిరువురికి వేర్వేరుగా ఇతరులతో వివాహాలు అయినప్పటికీ వివాహేతర బంధం ఏర్పడింది. కుటుంబసభ్యులకు భయపడుతూనే కొన్నేళ్లు కొనసాగించారు. ఇక బంధాన్ని వీడలేక.. కలసి ఉండలేక చనిపోయి ఒక్కటవుద్దామనుకున్నారు. చచ్చినా విడిపోకూడదని భావించి ఇద్దరు నడుముకు లుంగీతో కట్టుకుని శ్రీశైలం పాతాళగంగలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులది ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పాపినేనిపల్లె గ్రామానికి చెందిన ముద్దార్పు రమణ(45), దొంత పద్మ(38)గా పోలీసులు గుర్తించారు. పాపినేనిపల్లె గ్రామానికి చెందిన ముద్దార్ప రమణకు వరమ్మతో వివాహైంది.
వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దొంత పద్మకు వెంకటేశ్వర్లుతో 20 ఏళ్ల క్రితం వివాహమై, ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన కొన్నాళ్లకే రమణ, పద్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నా వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరు బంధాన్ని వీడలేక.. కలసి చచ్చిపోవాలని ఆదివారం శ్రీశైలం వచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక జాలర్లు పాతాళగంగలో ఇద్దరు మృతదేహాలు నీటిపై తేలుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేశారు. రమణ, పద్మలు చచ్చిపోయేటప్పుడు విడిపోకూడదని ఇద్దరు నడుములను లుంగీతో, మెడలను టవల్‌తో గట్టిగా కట్టుకుని పాతాళగంగలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రమణ మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్ల ద్వారా వారి బంధువులకు సమాచారం అందజేశామని సీఐ చక్రవర్తి, ఎస్‌ఐ లోకేష్‌కుమార్ తెలిపారు.