ఆనంపై మేయర్ వర్గం అసహనం
► అవినీతి, అక్రమాలు ఆయన హయాంలోనే
► తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
► టీడీపీ నాయకుడు షంషుద్దీన్
నెల్లూరు, సిటీ : మాజీ ఎమ్మెల్యే ఆనం తీరుపై మేయర్ వర్గంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. సోమవారం ‘సాక్షి’లో ‘మళ్లీ రచ్చే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మేయర్ వర్గంలోని కార్పొరేటర్‌లు, నాయకులు స్పందించారు. తమ నేతపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు సంసిద్ధమయ్యారు. నగరంలోని చిల్డ్‌న్స్‌ప్రార్క్ సమీపంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు షంషుద్దీన్ ఆనంపై ఘాటుగా స్పందించారు. తమ నాయకుడు కష్టపడి పనిచేస్తుంటే విమర్శించడం తగదన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. మరోసారి తమ నాయకుడిపై ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కాగా ఈ సమావేశంలో మేయర్ కూడా ఉండడం విశేషం.