తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అష్టమాస పాలన సాగించాయని, సాధించిన ఫలితం మాత్రం శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అష్టమాస పాలనలో ఏమి జరిగిందయ్యా అంటే... కేంద్రం సలహాలిస్తే, రాష్ట్రం సూచనలు మాత్రమే చేసిందన్నారు.
ఈ రెండు ప్రభుత్వాలు కన్సెల్టెన్సీ పాలన చేస్తున్నాయని ఆరోపించారు. భూసేకరణ బిల్లును అన్ని రాజకీయ పార్టీనేతలు వ్యతిరేకిస్తున్నా తెలుగుదేశం, బీజేపీ నేతలు మాత్రం బలవంతంగా తీసుకురావాలని కోరుకోవడం దారుణమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకిచ్చిన రుణమాఫీని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిద్వారా చంద్రబాబు సాహసోపేతంగా ఇంటర్‌నేషనల్ రియల్ ఎస్టేట్ మాఫియాకు తెరతీసాడని, సింగపూర్, జపాన్ దేశ కాంట్రాక్టర్లతో కలసి లాండ్ పూలింగ్ పేరుతో ల్యాండ్ మాఫియా నడిపిస్తున్నారని ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. భూసేకరణ చట్టం మీద పెట్టిన దృష్టి పేదలు, రైతులను ఆదుకునే రుణమాఫీ అమలుపై చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. మూడు సంవత్సరాలుగా రుణాలు కట్టొద్దుంటూ ఢంకా మోగించిన చంద్రబాబు రైతుల పరువు తీశారన్నారు.
'అష్టమాస పాలనలో ఫలితం శూన్యం'
Published Wed, Feb 25 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement